ఎయిర్‌టెల్‌ లాభం 39% డౌన్‌

19 Jan, 2018 00:14 IST|Sakshi

డిసెంబర్‌ క్వార్టర్‌ లాభం రూ.306 కోట్లే

ఆదాయం సైతం 13 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో పోటీ, అనిశ్చిత పరిస్థితుల ప్రభావం భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలపైనా కొనసాగింది. కన్సాలిడేటెడ్‌ లాభం 39 శాతం మేర తగ్గి రూ.306 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.504 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం రూ.20,319 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.23,336 కోట్ల ఆదాయంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గిపోయింది.

దేశీయ ఇంటర్‌ కనెక్షన్‌ వినియోగ చార్జీలను తగ్గిస్తూ ట్రాయ్‌ ఇచ్చిన ఆదేశాలతో సగటున ఓ వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం మరింత తగ్గిపోయినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాఫ్రికా) గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. అంతర్జాతీయ టెర్మినేషన్‌ చార్జీలను తగ్గించాలన్న ఇటీవలి నిర్ణయం ఈ ఆదాయ క్షీణతను ఇంకా తీవ్రం చేస్తుందన్నారు. దీనివల్ల విదేశీ ఆపరేటర్లకే తప్ప వినియోగదారులకు మేలు జరగదని చెప్పారాయన. అయితే, కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరగడం కాస్తంత ఆశాజనక విషయం.

డిసెంబర్‌ క్వార్టర్‌ నాటికి 16 దేశాల్లో మొత్తం కస్టమర్ల సంఖ్య 39.42 కోట్లకు వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కస్టమర్ల సంఖ్య కంటే 9.2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం ఆదాయాల్లో దేశీయ ఆదాయాలు రూ.15,294 కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11.3 శాతం క్షీణించినట్టు. ఆఫ్రికా ఆదాయాలు మాత్రం 5.3 శాతం పెరిగాయి. కన్సాలిడేటెడ్‌గా చూస్తే కంపెనీ రుణాలు రూ.91,714 కోట్లుగా ఉన్నాయి. 2016 డిసెంబర్‌ క్వార్టర్‌లో ఉన్న రూ.91,480 కోట్ల కంటే అతి స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది.

అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్‌ రూపేణా వచ్చిన ఆదాయాన్ని వాటాదారులకు అందించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఒక్కో షేరుకు రూ.2.84 చొప్పున మధ్యంతర డివిడెండ్‌కు సిఫారసు చేసింది. మార్కెట్లు ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌ 1.17 శాతం నష్టపోయి గురువారం రూ.494.50 వద్ద క్లోజయింది. 

మరిన్ని వార్తలు