ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్‌

23 Nov, 2019 03:30 IST|Sakshi

న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌ శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏజీఆర్‌ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌  రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్‌ ఐడియా కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి.

అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గత నెల 24వ తేదీన  ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం రూ.92,642 కోట్లు టెల్కోలు లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీగా చెల్లించాలి.    

మారటోరియం, టారిఫ్‌ పెంపు సరిపోదు: ఫిచ్‌ రేటింగ్స్‌
స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం, టారిఫ్‌ల పెంపు వంటివి సానుకూలమే అయినప్పటికీ .. వీటి వల్ల టెలికం రంగానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రతికూల తీర్పుతో భారీగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న టెల్కోలకు ఊరట లభించకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం.. టెలికం రంగానికి ప్రతికూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

జియోకు సానుకూలం..: టారిఫ్‌ పెంపుతో అత్యంత వేగంగా మార్కెట్‌ వాటా పెంచుకుంటున్న జియోకు లాభపడగలదని ఫిచ్‌ అంచనా వేసింది. 2020 ద్వితీయార్ధానికి జియో 40 కోట్ల మంది యూజర్లు, పరిశ్రమ ఆదాయంలో 40 శాతం వాటాను దక్కించుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు