ఇన్‌ఫ్రాటెల్‌- యూపీఎల్‌.. ఖుషీఖుషీగా

29 May, 2020 14:12 IST|Sakshi

నిఫ్టీ ఇండెక్స్‌లో టాప్‌ పెర్ఫార్మర్స్‌

5 శాతం జంప్‌చేసిన ఇన్‌ఫ్రాటెల్‌

వొడాఐడియాలో గూగుల్‌ పెట్టుబడి ఎఫెక్ట్‌

యూపీఎల్‌ 6.4 శాతం అప్‌- క్యూ4 ఇంపాక్ట్‌

జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలిరోజు మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. అయితే ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌ కౌంటర్లు టాప్‌ పెర్ఫార్మర్లుగా నిలుస్తున్నాయి. టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ ఇన్వెస్ట్‌చేయనున్న వార్తలు మొబైల్‌ టవర్ల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కౌంటర్‌కు జోష్‌నివ్వగా.. క్యూ4 ఫలితాలకుతోడు.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బయ్‌ రేటింగ్‌.. యూపీఎల్‌ షేరుకి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌
వొడాఫోన్‌ ఐడియాలో గూగుల్‌ 5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలతో టెలికం మౌలికసదుపాయాల కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 242ను అధిగమించింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. మార్చి 19న నమోదైన కనిష్టం రూ. 121 నుంచి చూస్తే 100 శాతం దూసుకెళ్లింది. టెలికం టవర్లు, కమ్యూనికేషన్స్‌ పరికరాల ద్వారా మొబైల్‌ కంపెనీలకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. కంపెనీకి గల అతిపెద్ద కస్టమర్ల జాబితాలో మొబైల్‌ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌లను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. దీంతో ఇటీవల దేశీ మొబైల్‌ టెలికం కంపెనీలలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు ఇన్‌ఫ్రాటెల్‌ బిజినెస్‌కు డిమాండ్‌ను పెంచే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా షేరు ఇటీవల జోరు చూపుతున్నట్లు తెలియజేశారు.

యూపీఎల్‌ లిమిటెడ్‌
గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో అగ్రి కెమికల్స్‌ దిగ్గజం యూపీఎల్‌ రూ. 761 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 31 శాతం పెరిగి రూ. 11141 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ యూపీఎల్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తూ రూ. 466 టార్గెట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న యూపీఎల్‌ షేరు తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 416కు చేరింది. తొలుత రూ. 420కు ఎగసింది. దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు 7-10 శాతం మధ్య పుంజుకోగలవని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. తద్వారా మార్కెట్‌ వాటాను మరింత పెంచుకోగలదని ఆశిస్తోంది. అరిస్టా లైఫ్‌సైన్స్‌ కొనుగోలు ద్వారా కంపెనీ ఇటీవల కొలంబియా, మెక్సికోలతోపాటు దేశీయంగా మార్కెట్‌ వాటాను పటిష్టం చేసుకుంటున్నట్లు అభిప్రాయపడింది. ముడివ్యయాలు తగ్గుతున్న కారణంగా రానున్న రెండేళ్లలో ఇబిటా మార్జిన్లు 0.8 శాతం బలపడగలవని ఊహిస్తోంది.

మరిన్ని వార్తలు