బీహెచ్‌ఈఎల్‌ ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు

18 Jan, 2019 05:02 IST|Sakshi

ఢిల్లీ–చండీగఢ్‌ హైవేపై ఏర్పాటు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఢిల్లీ– చండీగఢ్‌ జాతీయ రహదారిపై సోలార్‌ ఆధారిత చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌ ప్రకటించింది. ‘‘250 కిలోమీటర్ల పరిధిలో మధ్య మధ్యలో ఈ ఎలక్ట్రిక్‌ చార్జర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మధ్యలో చార్జింగ్‌ అయిపోతుందేమో!! ప్రయాణించటం కష్టమేమో!! అనే భయాలు ఎలక్ట్రిక్‌ వాహనాదారుల్లో తొలగుతాయి. ఎలక్ట్రిక్‌ వాహన ప్రయాణాలపై విశ్వాసం పెరుగుతుంది’’ అని భెల్‌ వివరించింది.

దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, ఇంధన దిగుమతులకు పరిష్కారంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, చార్జింగ్‌ వసతుల లేమి కొనుగోళ్లకు అడ్డుపడుతోంది. ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లను తామే సొంతంగా డిజైన్‌ చేయటంతో పాటు తయారీ, సరఫరా, ఇన్‌స్టాల్‌ కూడా చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ తెలిపింది. ప్రతీ ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో ఉంటుందని, వేగంగా, నిదానంగా చార్జ్‌ చేసే వసతులు కూడా ఉంటాయని వివరించింది. బీహెచ్‌ఈఎల్‌ ఇప్పటికే ఢిల్లీలోని ఉద్యోగ్‌ భవన్‌లో డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్‌ చార్జర్ల ఏర్పాటుకు సంబంధించి మరో ఆర్డర్‌ కూడా సంస్థ నిర్వహణలో ఉంది.

మరిన్ని వార్తలు