బ్యాంకులకు ‘భూషణ’ం

22 May, 2018 00:53 IST|Sakshi

భూషణ్‌ అమ్మకంతో బ్యాంకింగ్‌కు ఊరట

ప్రభుత్వ బ్యాంకుల ఎన్‌పీఏలు తగ్గుతాయి

రూ.35వేల కోట్ల మేర తగ్గే అవకాశం: ఆర్థికశాఖ  

న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా తీసిన భూషణ్‌ స్టీల్‌ను టాటా స్టీల్‌ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఈ లావాదేవీతో పీఎస్‌బీల మొండిబాకీలు (ఎన్‌పీఏ) సుమారు రూ. 35,000 కోట్ల మేర తగ్గుతాయని ఆయన తెలియజేశారు.

ఒక్కో పీఎస్‌బీ ఎన్‌పీఏలు సుమారు రూ.500 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల దాకా తగ్గగలవని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఆయన తెలిపారు. అలాగే, పీఎస్‌బీలకు 6 కోట్ల పైగా షేర్లు కూడా దాఖలుపడతాయని, ఇది కూడా ప్రయోజనకరమైన విషయమేనని ఆయన పేర్కొన్నారు. టాటా స్టీల్‌ తన అనుబంధ సంస్థ ద్వారా భూషణ్‌ స్టీల్‌లో 72.65 శాతం వాటాలను వేలంలో రూ.36,400 కోట్లు వెచ్చించి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

విక్రయంపై స్టేకి ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరణ..
భూషణ్‌ స్టీల్‌ను టాటా స్టీల్‌ కొనుగోలు చేయడంపై స్టే విధించేందుకు నేషనల్‌ కంపెనీ లా అïప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిరాకరించింది. దివాలా పరిష్కార ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడి దివాలా పరిష్కార ప్రక్రియ ముగింపు ఉంటుందని తెలిపింది.

భూషణ్‌ స్టీల్తో లాభమే: టాటా స్టీల్‌
ఉక్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే సుదీర్ఘ కాలం పట్టేసే నేపథ్యంలో.. భూషణ్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడం తమకు ప్రయోజనకరమేనని టాటా స్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ చెప్పారు. టేకోవర్‌ విషయంలో నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు