టాటా టెలీ ఫైబర్‌ ఆస్తుల కోసం బిడ్‌

27 Jan, 2018 01:08 IST|Sakshi

టాటా ఇంటర్నేషనల్‌ హెడ్‌ ముకుందరాజన్‌ ఆసక్తి..

ముంబై: టాటా టెలీసర్వీసెస్‌కు చెందిన ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ను(ఫైబర్‌ టెలికం నెట్‌వర్క్‌) కొనుగోలు చేయటానికి టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారులే బిడ్‌ వేసినట్లు తెలిసింది. టాటా గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ కార్యకలాపాల అధినేత, గతంలో బ్రాండ్‌ కస్టోడియన్‌గా వ్యవహరించిన ముకుందరాజన్‌ నేతృత్వంలో టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఈ బిడ్‌ను దాఖలు చేశారని ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న ఒక వ్యక్తి వెల్లడించారు. వీరికి టీపీజీ క్యాపిటల్‌ నేతృత్వంలోని కన్సార్షియమ్‌ తోడ్పాటునందిస్తోంది.

ఈ కన్సార్షియమ్‌ ఈ ఆస్తుల కోసం వంద కోట్ల డాలర్లపైనే  కోట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ కుదిరితే ఈ రంగంలో ఇదే అతి పెద్ద డీల్‌ కానుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కమ్యూనికేషన్స్‌ కూడా ఈ ఆస్తుల కొనుగోళ్ల రేసులో ఉంది. 1,25,000 రూట్‌ కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్, ఇతర ఆస్తులను ఈ కన్సార్షియమ్‌ దక్కించుకుంటే ఈ వ్యాపారాన్ని చూసుకోవడం కోసం ముకుందరాజన్‌ టాటా గ్రూప్‌ నుంచి బయటకొస్తారని ఆ వ్యక్తి పేర్కొన్నారు.

గతంలో టాటా టెలీసర్వీసెస్‌కు ఎమ్‌డీగా రాజన్‌ పనిచేశారని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించే అనుభవం అయనకుందని, అంతేకాకుండా కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ వార్తలపై టాటా సన్స్, టీపీజీ క్యాపిటల్‌ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటాటెలి సర్వీసెస్‌ తన మొబైల్‌ ఫోన్‌ వ్యాపారాన్ని గత ఏడాది అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు