'28 శాతం జీఎస్టీని తొలగించండి'

28 Jun, 2018 13:58 IST|Sakshi
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారుగా గత కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసిన అరవింద్ సుబ్రమణియన్‌ ఓ పెద్ద డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్ ట్యాక్స్‌(జీఎస్టీ) రూపాన్ని సులభతరం చేసేందుకు అ‍త్యధిక శ్లాబు అయిన 28 శాతాన్ని తొలగించాలని అరవింద్‌ సుబ్రమణియన్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాక అన్ని ఉత్పత్తులు, సర్వీసులపై ఒకే విధమైన సెస్‌ రేటును కొనసాగించాలని కూడా కోరారు. 

‘28 శాతం రేటును తొలగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. సెస్‌లు ఉండాలి. కానీ సెస్‌ల రేట్లన్నీ ఒకే విధంగా ఉంటే మంచిది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు జీరోగా, 3 శాతంగా(బంగారంపై), 5 శాతంగా, 12 శాతంగా, 18 శాతంగా, 28 శాతంగా ఉన్నాయి. వీటిని హేతుబద్ధం చేయాల్సినవసరం ఉంది. తొలుత 28 శాతం రేటును తొలగించాలి’ అని సుబ్రమణియన్‌ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా అరవింద్‌ సుబ్రమణియన్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

గత వారం క్రితమే సుబ్రమణియన్‌, ప్రధాన ఆర్థిక సలహాదారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌లో తనకు మనవడు/మనవరాలు పుట్టబోతున్నారని, ఈ క్రమంలోనే తాను కుటుంబంతా సమయం కేటాయించడానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారు వైదొలగడం ఇది రెండో సారి.  

మరిన్ని వార్తలు