బిల్‌గేట్స్‌ సంపద@ 100 బిలియన్‌ డాలర్లు 

20 Mar, 2019 22:00 IST|Sakshi

న్యూయార్క్‌ : మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ సంపద 100 బిలియన్‌ డాలర్లు దాటింది. ఈ మార్కుకు చేరుకున్నవారు ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరే. వారిలో ఒకరు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కాగా.. రెండో వ్యక్తి బిల్‌గేట్స్‌ మాత్రమే. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది. అయితే బిల్‌గేట్స్‌ 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటడం ఇదే తొలిసారి కాదు. 1999లో గేట్స్‌ ఆస్తి 100 బిలియన్‌ డాలర్లను దాటింది.

అయితే ఆ తర్వాత తన సంపదలో కొంత గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వడంతో కొంతమేర తగ్గింది. గేట్స్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మరో వ్యక్తి బెజోస్‌. ఆయన ప్రస్తుత సంపద 145.6 బిలియన్‌ డాలర్లు. అయితే ఈ ఘనత వీరికి ఎక్కువ కాలం ఉండకపోవచ్చని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. గేట్స్‌ ఫౌండేషన్‌ కోసం ఇప్పటికే బిల్‌గేట్స్‌ 35 బిలియన్‌ డాలర్లకుపైగా విరాళమిచ్చారు. తన సంపదలో సగాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ఆస్తులు తగ్గే అవకాశముంది. ఇక బెజోస్‌ తన భార్యకు భరణం కింద ఆయన ఆస్తుల్లో కొంత ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు