ఉద్యోగుల కారు నంబర్లూ గుర్తుపెట్టుకున్నా..

3 Feb, 2016 00:49 IST|Sakshi
ఉద్యోగుల కారు నంబర్లూ గుర్తుపెట్టుకున్నా..

వారాంతాల్లోనూ పని చేస్తూనే ఉండేవాణ్ని
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్

  లండన్: పని వేళల్లో ఉద్యోగులను అనుక్షణం పర్యవేక్షించేవాణ్నని, వారి లెసైన్స్ ప్లేట్‌లన్నీ కూడా గుర్తుపెట్టుకునే వాణ్నని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. అప్పట్లో సెలవు తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదని, వారాంతాల్లో కూడా పనిచేస్తూనే ఉండేవాణ్నని వివరించారు. బీబీసీ రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా అప్పట్లో తన మేనేజ్‌మెంట్ తీరును వివరించిన గేట్స్.. కొన్ని జ్ఞాపకాలనూ నెమరువేసుకున్నారు. ‘నాకు సెలవులు తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. నా విధానాలు, ప్రమాణాలను మా కంపెనీలో పనిచేసే మిగతావారిపై రుద్దకుండా ఉండటానికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. నాకు ప్రతీ ఒక్కరి లెసైన్సు ప్లేటు (వాహనం నంబరు) కూడా గుర్తుండేది.

పార్కింగ్ లాట్‌లోకి చూసి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారన్నవి లెక్కేసుకునే వాణ్ని’ అని బిల్ గేట్స్ చెప్పారు. అయితే కంపెనీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ తాను నిబంధనలు కూడా క్రమంగా సడలించాల్సి వచ్చిందని తెలిపారు.

 టెక్ దిగ్గజం యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌తో తన అనుబంధాన్ని కూడా గేట్స్ వివరించారు. స్టీవ్ ఒకోసారి చాలా కఠినంగా ఉండేవాడని, ఒకోసారి ఎంతగానో ప్రోత్సహించేవాడిగా ఉండేవాడని ఆయన చెప్పారు. తామిద్దరం కలిసి కూడా పనిచేశామన్నారు. యాపిల్ 2కి తాను సాఫ్ట్‌వేర్ కూడా రాశానని గేట్స్ చెప్పారు. ఎదుటివారి నుంచి అసాధారణమైన పనిని రాబట్టగలిగే దిట్ట జాబ్స్ అని కితాబిచ్చారు.

 క్లాసులో అమ్మాయిల మధ్య నేనొక్కణ్నే..
 పంథొమ్మిదో ఏట హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బైటికొచ్చి, మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించిన గేట్స్.. తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. క్లాసు మొత్తంలో మిగతా అబ్బాయిలెవరూ లేకుండా మొత్తం అమ్మాయిల మధ్యలో తానొక్కడే ఉండేలా మైక్రోసాఫ్ట్ మరో వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌తో కలసి షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌ను మార్చేసిన వైనాన్ని ఆయన వివరించారు. అలెన్ కాలేజీ చదువు అప్పటికే పూర్తయిపోవడంతో అది తనకు లాభించిందని గేట్స్ తెలిపారు. అయితే అమ్మాయిలతో మాట్లాడటంలో తాను అంతంతమాత్రమేనని, దీంతో అంతమంది చుట్టూ ఉన్నా వారితో పెద్దగా మాట్లాడేవాణ్ని కానని ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు