రూపాయికి ‘విదేశీ నిధుల’ అండ 

13 Mar, 2019 00:22 IST|Sakshi

18 పైసలు బలపడి 69.71కు అప్‌

రెండు నెలల గరిష్టస్థాయి

ముంబై: దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్‌ పరుగులు రూపాయిని బలోపేతం చేస్తున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 18పైసలు బలపడి 69.71 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో ఈ స్థాయిని రూపాయి చూడ్డం ఇదే తొలిసారి. విదేశీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీన ధోరణిసైతం రూపాయికి కలిసి వస్తోంది. మంగళవారం ఎగుమతిదారులు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున డాలర్‌ అమ్మకాలకు దిగారని ఫారెక్స్‌ డీలర్లు తెలిపారు.

దేశీయ ఈక్విటీ, డెట్‌ మార్కెట్‌లోకి మరిన్ని నిధులు వస్తాయన్న అంచనాలు రూపాయికి వరుసగా రెండవరోజూ లాభాలను తెచ్చిపెట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. సోమవారం కూడా రూపాయి 30 పైసలు లాభపడిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి  పడిపోతూ రావడంతో రూపాయి కోలుకుని 2 నెలల క్రితం ప్రస్తుత స్థాయిని చూసింది. 

మరిన్ని వార్తలు