రాకేష్‌ ఝంఝన్‌వాలాకు సెబీ నోటీసులు

28 Jan, 2020 10:04 IST|Sakshi

ముంబై : ఆప్టెక్‌ లిమిటెడ్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝంఝన్‌వాలాకు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ నోటీసులు జారీ చేసింది. రాకేష్‌కు చెందిన ఆప్టెక్‌ లిమిటెడ్‌ షేర్లకు సంబంధించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో షేర్‌హోల్డర్లుగా ఉన్న రమేష్‌ ఎస్‌ దమానీ, డైరెక్టర్‌ మధు జయకుమార్‌ సహా  ఇతర కుటుంబ సభ్యుల పాత్రపైనా సెబీ ఆరా తీస్తోంది. దర్యాప్తుకు సహకరించాలని నోటీసుల్లో సెబీ పేర్కొంది. కాగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎప్పుడు జరిగింది..దీనికి సంబంధించి లభించిన ఆధారాలు ఏమిటనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ ఆరోపణలపై ఝంఝన్‌వాలా ఆయన భార్య రేఖ, సోదరుడు రాజేష్‌ కుమార్‌, అత్త సుశీలాదేవి గుప్తాలను తమ ఎదుట హాజరు కావాలని సెబీ కోరింది.

కాగా సెబీ దర్యాప్తు అధికారి ఎదుట హాజరైన రాకేష్‌ను ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల తరపున తాను హాజరైనట్టు రాకేష్‌ ఝంఝన్‌వాలా తెలిపారు. షేర్‌మార్కెట్‌ ఆనవాళ్లను ఔపోసన పట్టిన రాకేష్‌ ఝంఝన్‌వాలను భారత వారెన్‌ బఫెట్‌గా అభివర్ణిస్తారు. రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత రాకేష్‌ ఝంఝన్‌వాలా అత్యంత సంపన్న ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్‌గా ప్రాచుర్యం పొందారు.

మరిన్ని వార్తలు