బయో ఏషియా...40 దాకా ఒప్పందాలు

19 Feb, 2014 10:10 IST|Sakshi
బయో ఏషియా...40 దాకా ఒప్పందాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న బయోఏషియా 2014 సదస్సు లో కంపెనీల మధ్య దాదాపు 30-40 దాకా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డెరైక్టర్-జనరల్ పీవీ అప్పాజీ తెలిపారు. సుమారు, 16 దేశాల నుంచి 100 కంపెనీలు పైగా ఇందులో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు. వీటిలో చాలా మటుకు సంస్థలు భారత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని బయోఏషియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అప్పాజీ మంగళవారం ఇక్కడ తెలిపారు. ఇందులో సుమారు 15-20 ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సంస్థలకే దక్కవచ్చని ఆయన వివరించారు.

 విదేశీ సంస్థలు ఎక్కువగా టీకాలు, ఫార్ములేషన్స్, వైద్య పరికరాలు తదితర విభాగాల్లో ఒప్పందాలు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. బయోఏషియా సదస్సులో రెండో రోజున సుమారు 600 మంది దాకా ప్రతినిధులు పాల్గొన్నారు. నవకల్పనలతో వ్యాపారావకాశాలు తదితర అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చైర్మన్ జీవీ ప్రసాద్, జీవీకే బయోసెన్సైస్ సీఈవో మణి కంటిపూడి మొదలైనవారు పాల్గొన్నారు.

 ఈ ఏడాదిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్-జీఎస్‌కే ఔషధానికి పేటెంటు
 దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) తాము సంయుక్తంగా రూపొందించిన తొలి ఔషధాన్ని ఈ ఏడాది రిజిస్టర్ చేయనున్నాయి. బయోఏషియా 2014 సదస్సులో మంగళవారం పాల్గొన్న సందర్భంగా జీఎస్‌కే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోజెరియో రిబెయిరో ఈ విషయం వెల్లడించారు.

ముందుగా యూరప్‌లో ఈ ఔషధాన్ని నమోదు చేసి వర్ధమాన దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఇది కార్డియోవాస్క్యులర్ సంబంధిత ఔషధం కావొచ్చన్నట్లు సూచనప్రాయంగా చెప్పిన రిబె యిరో మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. పేటెంటు వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కనీసం రెండేళ్లు పట్టేయవచ్చని ఆయన చెప్పారు. 2009లో కుదిరిన ఒప్పందం ప్రకారం మధుమేహం, కార్డియోవాస్క్యులర్ తదితర విభాగాలకు సంబంధించిన ఔషధాలను జీఎస్‌కే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా రూపొందించనున్నాయి.

>
మరిన్ని వార్తలు