టీకాలకు షార్ట్‌కట్‌ సరికాదు.. 

4 Jul, 2020 09:21 IST|Sakshi

బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టీకాల రూపకల్పన, అందుబాటులోకి తేవడమనేది చాలా సమయం పట్టేసే ప్రక్రియని, దీనికి షార్ట్‌కట్‌లు సరికావని బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా తెలిపారు. టీకా సమర్థమంతంగా పనిచేస్తుందా లేదా అన్నది పరిశీలించాలంటే వివిధ వర్గాలకు చెందిన వేల మందిపై పరీక్షించి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా నెల రోజుల్లో తేలిపోయే వ్యవహారం కాదన్నారు. సురక్షితంగా, సమర్థమంతంగా పనిచేయడమన్న అంశాలకే టీకాల రూపకల్పనలో ప్రాధాన్యం ఉండాలే తప్ప .. డెడ్‌లైన్ల ఆధారంగా వీటి రూపకల్పన ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆగస్టు 15 నాటికల్లా కరోనా వైరస్‌కు దేశీయంగా టీకా అందుబాటులోకి రానున్నదన్న వార్తల నేపథ్యంలో షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్‌ చాప్టర్‌ నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా షా ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, దేశీయంగా క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగం అభివృద్ధి చెందేందుకు, ఈ రంగంలో ఉపాధి కల్పనకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న ఈ రంగం .. నిషేధం కారణంగా మూతబడిందని పేర్కొన్నారు. క్లినికల్‌ రీసెర్చిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని షా వివరించారు. అటు, ప్రాథమిక వైద్య కేంద్రాలను (పీహెచ్‌సీ) టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలని, టెలీమెడిసిన్‌పై అవగాహన మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని ఇందులో పాల్గొన్న అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ, ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీత రెడ్డి తెలిపారు. అలాగే దేశీ హెల్త్‌కేర్‌ రంగ అభివృద్ధికి మానవ వనరులు, దేశీయంగా తయారీ కీలకాంశాలని ఆమె చెప్పారు. 

మరిన్ని వార్తలు