బిట్‌కాయిన్‌ మానియా: మెగాస్టార్‌ సంపద ఎంత పెరిగిందంటే..

20 Dec, 2017 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ పెట్టుబడుల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ పెట్టుబడుల ద్వారా ఆర్జనలో కూడా బిగ్‌ బి  అనిపించుకున్నారు. అటు నటలోనూ, ఇటు  సంపదని నిర్మించుకోవడంలోనూ  మెగాస్టార్‌గా నిలిచారు. బిగ్‌ బి కుటుంబానికి చెందిన షేర్ల పెట్టుబడి విలువ రెండున్నర సంవత్సరాలలో భారీ పెరుగుదలను నమోదు చేసింది. రెండు సంవత్సరాల క్రితం  250,000 డాలర్లుగా ఉన్న  సంపద కాస్తా ఇపుడు 17.5 మిలియన్‌ డాలర్లకు  పెరిగింది.

2015లో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరైజ్డ్ రెమిటన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా విదేశీ కంపెనీలో  తొలి ముఖ్యమైన ఈక్విటీ పెట్టుబడులు పెట్టారు. తండ్రి-కొడుకు ద్వయం, (అమితాబ్‌,అభిషేక్)లు మెరీడియన్ టెక్ పిటీ లిమిటెడ్‌ 250,000డాలర్ల (దాదాపు రూ. 1.57 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఈ స్టాక్‌ బాగా పుంజుకోవడంతో  సంపద 17.5మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.113కోట్లకు) చేరింది.  అమితాబ్ ఖాతా ద్వారా 150,000 డాలర్లు, అమితాబ్ , అభిషేక్‌ల జాయింట్‌ అకౌంట్‌  ద్వారా లక్ష డాలర్ల పెట్టుబడులున్నాయని మెరిడియన్ టెక్ స్థాపకుడు,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట శ్రీనివాస్ మీనావల్లి ప్రకటించారు.

అయితే మెరిడియన్ టెక్  అంత పాపులర్‌ స్టాక్‌ కాదు. ఇటీవల మెరీడియన్‌కు చెందిన జిద్దు.కామ్‌ను మరో విదేశీ సంస్థ  లాంగ్ ఫిన్ కార్ప్  కొనుగోలు చేసింది. అమెరికన్‌ స్టాక్‌మార్కెట్‌ నాస్‌డాక్‌లో లిస్ట్‌ అయిన రెండు రోజుల తర్వాత   ఈ స్టాక్‌ అనూహ్యంగా లాభపడింది. దీంతో  లాంగ్ ఫిన్ కార్ప్ లో బిగ్‌ బి కుటుంబం షేర్‌ విలువ అమాంతం పెరిగింది. కాగా 2017, డిసెంబరు లో జిడ్డు.కామ్  బ్లాక్‌ చైన్‌ లేదా క్రిప్టోకరెన్సీ టెక్నాలజీ ఆధారిత  సొల్యూషన్స్‌  ప్రొవైడర్‌గా స్వయంగా ప్రకటించుకుంది. అంటే  క్రిప్టోకరెన్సీ ద్వారా వివిధ  ఖండాల్లో  సూక్ష్మ రుణాలను అందిస్తుంది. కాగా  ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రిప్టోకరెన్సీ మానియా నేపథ్యంలో లాంగ్‌ఫిన్‌ స్టాక్‌ వెయ్యి శాతం కంటే ఎక్కువ లాభపడింది.

మరిన్ని వార్తలు