సంస్కరణలకు మరింత ఊతం

16 Mar, 2017 01:07 IST|Sakshi
సంస్కరణలకు మరింత ఊతం

భారత రుణపరపతికి సానుకూలం
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాలు దక్కడం వల్ల బీజేపీ రాజ్యసభలో మరింత బలం పెంచుకోగలదని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఇది మరిన్ని సంస్కరణలకు ఊతమివ్వగలదని వివరించింది. ఈ పరిణామం భారత ప్రభుత్వ రుణపరపతి రేటింగ్‌పై సానుకూల ప్రభావం చూపగలదని మూడీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న ఎన్‌డీఏ క్రమంగా పుంజుకుంటుందని, మార్పులు తక్షణమే చోటుచేసుకోబోవని తెలిపింది. ‘ఎన్నికల ఫలితాల ప్రయోజనాలు అధికార పార్టీకి సత్వరమే దఖలు పడవు.

ఎందుకంటే వచ్చే ఏడాది కొందరు సభ్యులు రిటైరైతే గానీ ఎగువసభలో మార్పులు, చేర్పులు ఉండవు‘ అని మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం ఫాస్టర్‌ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షాలకు రాజ్యసభలో 30 శాతం సీట్లు ఉన్నాయి. 2018లో రాజ్యసభలో 69 సీట్లు రీ–ఎలక్షన్‌కు రానున్నాయి. వీటిలో పది ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి, ఒక సీటు ఉత్తరాఖండ్‌ నుంచి ఉండనున్నాయి. దీంతో అప్పటిదాకా విధానపరమైన చర్యల ఆమోదం కోసం అధికారపక్షం ఇతర పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.

మరోవైపు, గతేడాది ఆఖర్లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల ఎదురైన ప్రతికూల ఆర్థిక ప్రభావాలను కూడా తట్టుకుని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని నివేదికలో మూడీస్‌ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన జాతీయ విధానాల అజెండాకు గట్టి మద్దతు లభిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు