బయటపడిన నల్లధనం రూ.4,900 కోట్లే

8 Sep, 2017 00:13 IST|Sakshi
బయటపడిన నల్లధనం రూ.4,900 కోట్లే

న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడికి మోదీ సర్కారు తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పథకానికి స్పందన స్వల్పంగానే ఉంది. 21 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. రూ.4,900 కోట్ల మేర నల్లధనం వివరాలను వీరు స్వచ్ఛందంగా వెల్లడించారు. ఈ పథకం మార్చి 31తో ముగిసిపోయింది. ఇవి తుది వివరాలని, వీటి ఆధారంగా రూ.2,451 కోట్ల పన్ను రాబట్టినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని కేసుల్లో వివరాల ఆధారంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం లెక్కల్లో చూపని ఆదాయాన్ని (బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు సైతం) గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద స్వయంగా వెల్లడించి 50 శాతం పన్ను చెల్లింపుతో బయటపడొచ్చని కేంద్ర సర్కారు సూచించింది. మిగిలిన మొత్తంలో సగాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహితంగా ప్రభుత్వం వద్ద కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది. నల్లధనం కలిగిన వారికి ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత అధికారులు గుర్తిస్తే 200 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ దశలో హెచ్చరిక కూడా చేసింది. ఈ పథకం మార్చిలో ముగియగా, వచ్చిన స్పందన ఆశాజనకంగా లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు