బ్లాక్‌బెర్రీ క్యూ5 @ రూ. 24,990

17 Jul, 2013 03:53 IST|Sakshi

- ఈ నెల 20 నుంచి విక్రయాలు
- త్వరలో బ్లాక్‌బెర్రీ 7, 10 సిరీస్ ఫోన్‌లు

న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ కంపెనీ క్యూ5 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ.24,990గా నిర్ణయించామని, ఈ నెల 20 నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని బ్లాక్‌బెర్రీ భారత కార్యకలాపాల ఎండీ సునిల్ లాల్వానీ పేర్కొన్నారు. డేటాను ఎక్కువగా యాక్సెస్ చేసే పట్టణ యువత లక్ష్యంగా క్వెర్టీ కీబోర్డ్ ఉన్న ఈ టైప్ అండ్ టచ్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్‌బెర్రీ కంపెనీ బీబీ10 సాఫ్ట్‌వేర్‌పై ఇప్పటి వరకూ రెండు స్మార్ట్‌ఫోన్‌లను, క్యూ10(రూ.45,000), జడ్10(రూ.43,490) విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ల ధర రూ.40 వేల పైనే ఉండటంతో తక్కువ ధరలో తాజాగా క్యూ5 ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. క్యూ10 ఫోన్ ధరతో పోల్చితే ఈ క్యూ5 ఫోన్ ధర దాదాపు సగం ఉంది.

3.1 అంగుళాల చతురస్రాకార కెపాసిటివ్ టచ్ స్క్రీన్, డ్యుయల్ కోర్ క్వాల్‌కామ్ 1.2 గిగా హెర్ట్స్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 8 గిగాబైట్ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 5 మెగా పిక్సెల్ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా, 2180 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

భారత్‌లో కొత్త ఉద్యోగాలు: త్వరలో బ్లాక్‌బెర్రీ 7, బ్లాక్‌బెర్రీ 10 సిరీస్ ఫోన్‌లను మార్కెట్లోకి తెస్తామని లాల్వానీ చెప్పారు. వ్యయ నియంత్రణలో భాగంగా అంతర్జాతీయంగా 5 వేల ఉద్యోగాలను బ్లాక్‌బెర్రీ తొలగించనున్నదన్న వార్తలను ఆయన ధ్రువీకరిం చారు. కానీ భారత్‌లో ఉద్యోగాల కోత లేదని, పైగా ఇక్కడి మార్కెట్ వృద్ధి చెందుతుండటంతో మరిన్ని కొత్త ఉద్యోగాలివ్వనున్నామని వివరించారు. మొత్తం 178 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, వీటిల్లో తమ టాప్ 10 మార్కెట్లలో భారత్ కూడా ఒకటన్నారు. ప్రస్తుతం బ్లాక్‌బెర్రీ ఆప్‌లు లక్ష వరకూ ఉన్నాయని, వీటిల్లో 16 వేల వరకూ భారతీయులు డెవలప్ చేసినవే ఉన్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు