బ్లాక్‌స్టోన్‌ చేతికి ఎస్సెల్‌ ప్రోప్యాక్‌

23 Apr, 2019 00:30 IST|Sakshi

డీల్‌ విలువ రూ.3,211 కోట్లు

ముందు ప్రమోటర్ల నుంచి 51% వాటా కొనుగోలు

తర్వాత 26 శాతానికి ఓపెన్‌ ఆఫర్‌  

ముంబై: అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్‌ కంపెనీ ఎస్సెల్‌ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్‌ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్‌ ట్యూబ్స్‌ను ఎస్సెల్‌ ప్రోప్యాక్‌ తయారుచేస్తోంది. ఈ డీల్‌ రెండంచెల్లో ఉండనుంది. తొలి దశలో ప్రమోటరు అశోక్‌ గోయల్‌ ట్రస్ట్‌ నుంచి బ్లాక్‌స్టోన్‌ 51% వాటా కొనుగోలు చేస్తుంది. షేరు ఒక్కింటికి రూ.134 రేటుతో ఈ డీల్‌ విలువ సుమారు రూ.2,157 కోట్లుగా ఉంటుంది. రెండో దశలో మరో 26% వాటాలను కొనుగోలు చేసేందుకు బ్లాక్‌స్టోన్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తుంది. ఒక్కో షేరుకి రూ.139.19 చొప్పున ఓపెన్‌ ఆఫర్‌ విలువ  రూ.1,054 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 37 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎస్సెల్‌ ప్రోప్యాక్‌కు 10 దేశాల్లో 20 పైగా ప్లాంట్లు, 3,150 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏటా 700 కోట్ల ల్యామినేటెడ్‌ ట్యూబ్స్‌ను తయారు చేస్తోంది. ఓపెన్‌ ఆఫర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగా ఎస్సెల్‌ ప్రోప్యాక్‌ కొనుగోలు విలువ రూ.2,157 కోట్ల నుంచి రూ. 3,211 కోట్ల దాకా ఉండవచ్చని బ్లాక్‌స్టోన్‌ సీనియర్‌ ఎండీ అమిత్‌ దీక్షిత్‌ చెప్పారు. 

ఎస్సెల్‌ గ్రూప్‌తో సంబంధం లేదు: అశోక్‌ గోయల్‌  
దాదాపు రూ.17,174 కోట్ల రుణాల భారంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటరు సుభాశ్‌ చంద్ర సోదరుడు అశోక్‌ గోయల్‌కు చెందినదే ఈ ఎస్సెల్‌ ప్రోప్యాక్‌. అశోక్‌ గోయల్‌ ట్రస్టుకు ఇందులో 57 శాతం వాటాలుండగా.. అందులో 51 శాతం వాటాలను బ్లాక్‌స్టోన్‌ కొనుగోలు చేస్తోంది. డీల్‌ ద్వారా వచ్చిన నిధులను ముంబైలో తాము నిర్వహిస్తున్న అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ ఎస్సెల్‌ వరల్డ్‌ను, వాటర్‌ కింగ్‌డమ్‌ను అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని, మరికొన్ని నిధులను దాతృత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తామని గోయల్‌ చెప్పారు. సోదరుడు సుభాశ్‌చంద్రకు చెందిన ఎస్సెల్‌ గ్రూప్‌ రుణభారం తగ్గించేందుకు ఈ నిధులేమైనా ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తమ సంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌లో భాగం కాదని.. గోయల్‌ ట్రస్టుకు గానీ ఎస్సెల్‌ ప్రోప్యాక్‌కు గానీ దానితో ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ‘మాదంతా ఒకే కుటుంబం. ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటాం. అయితే రెండు గ్రూపుల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు గానీ క్రాస్‌ హోల్డింగ్స్‌ గానీ లేవు‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న అశోక్‌ గోయల్‌ ఒప్పందం పూర్తయ్యాక 6 శాతం వాటాలతో కంపెనీలో సలహాదారుగా కొనసాగుతారు. ఇందుకు గాను అయిదేళ్ల పాటు ఏటా రూ.16 కోట్లు అందుకుంటారు. డీల్‌ నేపథ్యంలో బీఎస్‌ఈలో సోమవారం ఎస్సెల్‌ ప్రోప్యాక్‌ షేరు 0.91 శాతం పెరిగి రూ. 132.65 వద్ద క్లోజయ్యింది. 

మరిన్ని వార్తలు