బ్లాక్‌స్టోన్‌ చేతికి వన్‌ బీకేసీ బిల్డింగ్‌

20 Jun, 2019 11:56 IST|Sakshi

డీల్‌ విలువ రూ.2,500 కోట్లు  

దేశీ ఆఫీస్‌ స్పేస్‌ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద డీల్‌

ముంబై: అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్‌... ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌(బీకేసీ)లో ఉన్న ఎనిమిది అంతస్తుల వన్‌ బీకేసీ బిల్డింగ్‌లో దాదాపు సగం ఆఫీస్‌ స్పేస్‌ను కొనుగోలు చేసింది. రేడియస్‌ డెవలపర్‌ నుంచి వన్‌ బీకేసీలో 0.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ను బ్లాక్‌స్టోన్‌ సంస్థ రూ.2,500 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ ఆఫీస్‌ స్పేస్‌ సెగ్మెంట్లో ఇదే అతి పెద్ద డీల్‌. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన వన్‌ బీకేసీ బిల్డింగ్‌లో అమెజాన్, ఫేస్‌బుక్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, హిటాచి, తదితర దిగ్గజ కంపెనీల కార్యాలయాలున్నాయి.  వన్‌ బీకేసీ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి రేడియస్‌ సంస్థ రూ.1,600 కోట్ల రుణం తీసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులను ఈ రుణాన్ని తీర్చడానికి ఉపయోగించాలని రేడియస్‌ భావిస్తోంది. 

1.040 కోట్ల డాలర్ల పెట్టుబడులు..: బ్లాక్‌స్టోన్‌ సంస్థ, భారత్‌లో 2005 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 1,040 కోట్ల డాలర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టింది. దేశీయ రియల్టీ రంగంలో అతి పెద్ద అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ ఈ సంస్థే. మన రియల్టీ రంగంలో ఈ కంపెనీ ఇప్పటివరకూ 540 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్లాక్‌స్టోన్‌ కంపెనీ ప్యాకేజింగ్‌ కంపెనీ ఎస్సెల్‌ ప్రో ప్యాక్‌లో మెజారిటీ వాటాను రూ.3,211 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవలనే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను రూ.3,000కోట్లకు చేజిక్కించుకుంది.ఎంబసీ సంస్థ భాగస్వామ్యంలో దేశంలోనే తొలి రీట్‌ను ఎంబీస్‌ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంబసీ గ్రూప్‌తో పాటు ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్, పంచశీల్‌ రియల్టీ, కె.రహేజా కార్పొ, తదితర డెవలపర్లతో కూడా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు