ఆగస్ట్‌ తర్వాత అందరికీ మారిటోరియం అనవసరం

11 Jul, 2020 14:32 IST|Sakshi

ఎస్‌బీఐలో మారిటోరియం తక్కువే

ఆగస్ట్‌ తర్వాత అన్ని రంగాలకు మారిటోరియం కొనసాగింపు అవసరం లేదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజినీష్‌ అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో మారిటోరియం కొనసాగింపుపై ఆర్‌బీఐ సెక్టార్లవారీగా విశ్లేషించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని రజనీష్‌ తెలిపారు. ఎస్‌బీఐ నిర్వహించిన 2రోజుల వర్చువల్‌ ఇంటర్నల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్‌బీఐ వద్ద మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పూర్తి గణాంకాలు ఉన్నాయి. ఈ లెక్కలు ఆధారంగానే ఆర్‌బీఐ మారిటోరియం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. అత్యవరసమని భావించిన కొన్ని రంగాలకు తప్ప మారిటోరియం అనవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధించిన మారిటోరియంను డిసెంబర్‌ వరకు కొనసాగించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తున్నదని కొన్ని మీడియా వర్గాలు ప్రస్తావించిన నేపథ్యంలో రజినీష్‌ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. 

ఎస్‌బీఐలో మారిటోరియం తక్కువే:
ఎస్‌బీఐలో మారిటోరియం ఆప్షన్‌ ఎన్నుకొన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని రజనీష్‌ తెలిపారు. మే చివరినాటికి ఎస్‌బీఐ మారిటోరియం ఉపయోగించుకున్న ఖాతాలు సుమారు 20శాతమని, రెండోదశ మారిటోరియంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆరునెలల మారిటోరియం ఒక మినిరీకన్‌స్ట్రక్చన్‌ అని, కోవిడ్‌-19 కారణంగా నష్టాలను చవిచూసిన కంపెనీలకు వాస్తవ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన సూచనాప్రాయంగా తెలిపారు.

‘‘ఏదైనా ఉపశమనం మూడు విధాలుగా చూడాలి. ఒకటి వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలను అంచనా వేయడం, టర్మ్ లోన్ రిలీఫ్ ద్వారా క్యాష్‌ఫ్లోను సరిచేయడం, నష్టాలను చవిచూస్తున్న కార్పొరేట్‌లకు పటిష్టమైన పునర్‌ వ్యవస్థీకరణ చేయడం’’ అని రజనీష్‌ వివరించారు. 

జూన్‌లో రికవరి బాగుంది :
ఫైనాన్షియల్‌ యాక్టివిటి ఏప్రిల్ కంటే మేలో మెరుగ్గా ఉంది. జూన్‌లో మంచి రికవరీని చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రికవరి బాగుంది. అయితే పారిశ్రామిక హబ్‌లైన మహారాష్ట్ర, గుజరాత్‌, నేషనల్‌ క్యాపిటల్‌ రీజనల్‌(ఢిల్లీ, హర్యనా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌)లో కోవిడ్‌-19 ప్రభావం అధికంగా ఉంది.’’ అని రజనీష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు