మూడురోజుల్లో రూ.10లక్షల కోట్లు ఆవిరి

6 Feb, 2018 19:49 IST|Sakshi

సాక్షి, ముంబై: బడ‍్జెట్‌ ప్రకంపనలకు తోడు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో స్టాక్‌మార్కెట్లు విలవిలలాడాయి.   ముఖ్యంగా అమెరికా, ఆసియా మార్కెట్లలోని నెగెటివ్ ట్రేడింగ్  దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను భారీగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో కేవలం మూడు రోజుల్లోనే  ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆహుతైపోయింది. అదీ మంగళవారం ఒక్క రోజే రూ.3లక్షల కోట్లు సంపద ఆవిరి అయిదంటూ షేర్‌మార్కెట్‌పతనం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్ రూ.7 లక్షల కోట్లు నష్టపోయినట్లు బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఇందులో రూ.32 వేల కోట్లను ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ నష్టపోయినట్టు పేర్కొంది. 24 గంటల్లోనే ఆయన 32వేల కోట్ల రూపాయలు నష్టపోయారట.

మార్కెట్‌ బ్లడ్‌బాత్‌పై  ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శి హస్ముక్‌ ఆధియా  స్పందించారు. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ప్రభావం  దేశీయంగా  కూడా ప్రతిబింబించిందని  వ్యాఖ్యానించారు. అయితే  బడ్జెట్లో గత వారంలో ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాల  పన్నును  రద్దు చేయనుందా అని ప్రశ్నించినపుడు ప్రభుత్వం తాను  చేయాల్సింది చేస్తుందని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  ఎల్‌టీసీజీ టాక్స్‌ ప్రతిపాదనతో  ఫిబ్రవరి 1నుంచి కీలక సూచీలు వరుస పతనాన్ని నమోదు చేస్తుండగా. శుక్రవారం రూ.5లక్షల కోట్లు మాయం అయిన సంగతి తెలిసిందే.  వరుసగా అదే ధోరణి కొనసాగుతూ..  మూడు సెషన్స్ లోనే రూ.10 లక్షల కోట్లు సంపద స్టాక్ మార్కెట్ నుంచి మాయం అయ్యింది. నేడు మంగళవారం స్టాక్ మార్కెట్లు ఒపెనింగ్ లోనే  భారీ పతనాన్ని నమోదు చేశాయి.  సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు కుప్పకూలింది. అయితే ముగింపులో వాల్యూ బైయింగ్‌తో  561 పాయింట్ల నష్టంతో 34,195 దగ్గర ముగిసింది. ‌ నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 10,498 దగ్గర ముగిసింది.  దాదాపు 200  షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. డోజోన్స్‌ రెండురోజుల్లో  2,200 పాయింట్లు  కుప్పకూలడం ప్రపంచ మార్కెట్లను దెబ్బతీసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖ్య ఎనలిస్ట్‌ విజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

 కాగా అమెరికా జాబ్స్‌ డేటా మార్కెట్‌ రిపోర్ట్స్ అక‍్కడి  సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అటు ఫెడ్‌ వడ్డీరేట్లుపెంపు అంచనాలు కూడా ఆందోళనకు దారితీసింది. 2009 తర్వాత అమెరికాలో జీతాలు పెరిగిపోతున్నాయనీ.. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉండటంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా డోజోన్స్‌, నాస్‌డాక్‌లు భారీ నష్టాలను నమోదు చేశాయి.
 

మరిన్ని వార్తలు