ఈ 12 బ్లూచిప్‌ స్టాక్స్‌ దారెటు?

28 May, 2020 09:40 IST|Sakshi

గరిష్టాల నుంచి 50 శాతం డౌన్‌

జాబితాలో 12 నిఫ్టీ దిగ్గజాలు 

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు అధికం

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌

ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌

ఓఎన్‌జీసీ, వేదాంతా, గెయిల్‌, జీ 

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 9200- 8,800 పాయింట్ల మధ్య పరిమిత శ్రేణిలో ఊగిసలాడుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచ మార్కెట్లన్నిటా అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీయంగానూ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో మార్చి నెలలో నిఫ్టీ గరిష్టాల నుంచి 38 శాతం జారింది. తదుపరి ఏప్రిల్‌లో ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. ఆపై తిరిగి ఈ నెలలో ఒడిదొడుకుల మధ్య వెనకడుగు వేస్తోంది. వెరసి ఇటీవల నమోదైన రికార్డ్‌ గరిష్టం నుంచి చూస్తే ప్రస్తుతం నిఫ్టీ 27 శాతం నీరసించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే దిగ్గజాలలో 12 స్టాక్స్‌ ఇప్పటికీ 50 శాతం దిగువనే కదులుతుండటం గమనార్హం! ఈ బ్లూచిప్స్‌ తమ గరిష్టాల నుంచి చూస్తే కనీసం 50 శాతం క్షీణించి కదులుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో అధిక శాతం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగం నుంచే చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. 

జాబితా ఇలా
ఏస్‌ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఇటీవల నమోదైన 52 వారాల గరిష్టాల నుంచి 12 నిఫ్టీ స్టాక్స్‌ 50 శాతం దిగజారి ట్రేడవుతున్నాయి. వీటిలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రూ. 1673 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా.. బుధవారానికల్లా రూ. 348కు చేరింది. ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ ఏడాది గరిష్టం రూ. 4923కాగా.. 60 శాతం పతనమై రూ. 1936ను తాకింది. ఈ బాటలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 58 శాతం పడిపోయి రూ. 4258 వద్ద కదులుతోంది. ఈ షేరు 10,297 వద్ద ఏడాది గరిష్టాన్ని సాధించింది. ఇక పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ సైతం 52 వారాల గరిష్టం రూ. 374 నుంచి 57 శాతం తిరోగమించి రూ. 159 స్థాయికి చేరింది. ఇతర కౌంటర్లలో జీ ఎంటర్‌ప్రైజెస్‌ 59 శాతం వెనకడుగుతో రూ. 406 నుం‍చి రూ. 165కు చేరగా.. టాటా మోటార్స్‌ రూ. 202 నుంచి 59 శాతం పతనమై రూ. 86ను తాకింది. ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ యాక్సిస్‌ రూ. 827 స్థాయి నుంచి 50 శాతం నీరసించి రూ. 387కు చేరగా.. ఇంధన రంగ బ్లూచిప్‌ ఓఎన్‌జీసీ రూ. 176 నుంచి రూ. 78కు జారింది. ఇదే విధంగా పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ 52 వారాల గరిష్టం రూ. 170 నుంచి 55 శాతం కోల్పోయి రూ. 77కు చేరగా.. కోల్‌ ఇండియా రూ. 271 నుంచి 53 శాతం నష్టపోయి రూ. 127ను తాకింది. గెయిల్‌ ఇండియా రూ. 183 స్థాయి నుంచి 52 శాతం క్షీణించి రూ.88కు చేరగా.. వేదాంతా రూ. 180 నుంచి రూ. 88కు పడిపోయింది. 52 వారాల గరిష్టం నుంచి రూ. 51 శాతం పతనమైంది.

పలు కారణాలు
కరోనా వైరస్‌ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ కారణంగా పలు రంగాలలో కార్యకలాపాలు నిలిచిపోవడం, ఉపాధికి దెబ్బతగలడం, దేశీయంగా తొలిసారి ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాసహా ప్రపంచ దేశాలలో నిరంతరంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19 ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు 6-12 నెలల సమయం పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్యాకేజీలు, కేంద్ర బ్యాంకుల లిక్విడిటీ చర్యలు పలు రంగాలకు దన్నుగా నిలుస్తున్నప్పటికీ రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు దెబ్బతినే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆరు నెలల మారటోరియం, ఉపాధి కల్పనకు విఘాతం వంటి ప్రతికూలతలతో ప్రధానంగా బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలు కుదేలయ్యే అవకాశమున్నట్లు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో ఆటో అమ్మకాలు నిలిచిపోవడం, పలు రంగాలలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో పుంజుకోకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలపై ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌-19 కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలియజేశారు. అయితే పటిష్ట బ్యాలన్స్‌షీట్లు, అధిక మార్కెట్‌ వాటా కలిగి, బలమైన యాజమాన్య నిర్వహణలో ఉన్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సైతం భవిష్యత్‌లో పుంజుకునే వీలున్నట్లు తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు