బీఎండబ్ల్యూ మేడిన్‌ ఇండియా ‘మినీ కంట్రీమ్యాన్‌’

4 May, 2018 00:50 IST|Sakshi

ప్రారంభ ధర రూ. 34.9 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా మేడిన్‌ ఇండియా ‘మినీ కంట్రీమ్యాన్‌’ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ అప్‌డేటెడ్‌ (రెండో జనరేషన్‌) ఎస్‌యూవీ ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.34.9 లక్షలు. ఇందులో 2 లీటర్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.

బీఎండబ్ల్యూ ఇదివరకు మినీ కంట్రీమ్యాన్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేది. అయితే ఈసారి మాత్రం దేశీయంగానే చెన్నై ప్లాంటులో దీన్ని అసెంబుల్‌ చేసింది. మినీ కంట్రీమ్యాన్‌.. డీజిల్, పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. జూన్‌ నుంచి వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది.

రెట్టింపు అమ్మకాలు లక్ష్యం..
మినీ బ్రాండ్‌లో రెట్టింపు అమ్మకాలే లక్ష్యంగా మినీ కంట్రీమ్యాన్‌ను ఆవిష్కరించామని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. గతేడాది మినీ బ్రాండ్‌ అమ్మకాలు 17 శాతం వృద్ధితో 421 యూనిట్లకు చేరాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో 136 యూనిట్లను విక్రయించామన్నారు.

కస్టమర్లకు అధిక విలువ చేకూర్చడమనే వ్యూహంలో భాగంగా రెండో జనరేషన్‌ మినీ కంట్రీమ్యాన్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ‘భారత్‌లో మినీ బ్రాండ్‌ ఎదుగుదలకు అపార అవకాశాలున్నాయి. తొలి దశలో మేం ప్రస్తుత ఏడాది రెట్టింపు అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు