బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి

20 Apr, 2020 17:04 IST|Sakshi
బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో రుద్ర తేజ్ సింగ్ (ఫైల్ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్ర తేజ్ సింగ్ (46)  సోమవారం ఉదయం హఠాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుతో రావడంతో ఆయన మృతి చెందారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ  యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ తెలిపింది.ఈ కష్ట కాలంలో కుటుంబంతోపాటు సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. స్ఫూర్తిదాయకమైన , మానవత్వమున్న  నాయకుడిగా రుద్ర  నిలిచిపోతారని  బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బీఎండబ్ల్యూ ఇండియా యాజమాన్యం, సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగి పోయారు. 

1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ క్రమంగా ఎదుగుతూ విజయ పథాన్ని నిర్మించుకున్నారు. 2019 ఆగస్టు 1 ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్ర బీఎండబ్ల్యూ సంస్థకు నాయకత్వాన్ని చేపట్టిన మొదటి భారతీయుడు. అంతకు ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని సొంతం చేసుకున్న రుద్ర ప్రతాప్ ఆటోమోటివ్,  నాన్-ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక నాయకత్వ పదవులను చేపట్టి విజయం సాధించారు.

మరిన్ని వార్తలు