బీఎండబ్ల్యూ007..

27 Sep, 2018 09:09 IST|Sakshi

జేమ్స్‌ బాండ్‌ సినిమాలంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఈ సినిమాల్లో బాండ్‌ లాగే ఆయన వాడే కారు కూడా ఫేమస్‌. అందులో అత్యాధునిక గాడ్జెట్స్‌ ఉంటాయి కదా. అయితే.. అలాంటివి బాండ్‌కే సొంతమా.. సినిమాలకే పరిమితమా.. అస్సలు కాదు.. ఎందుకంటే.. బీఎండబ్ల్యూ కంపెనీ కొంచెం ఆ టైపు ఎస్‌యూవీ(స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌)ని మార్కెట్లోకి తేనుంది. దాని పేరు విజన్‌ ఐనెక్ట్స్‌. ఇదో ఎలక్ట్రిక్‌ కారు.. అంతేకాదు.. దీనికి డ్రైవర్‌ అక్కర్లేదు. శాటిలైట్‌ నేవిగేషన్‌ మ్యాప్‌ ద్వారా మనకు కావాల్సిన ప్రదేశానికి వెళ్లిపోతుంది. పార్కింగ్‌ కూడా అదే చేసుకుంటుంది. కావాలంటే.. మనం నడపొచ్చు. కారు ఉపయోగంలో లేనప్పుడు లేదా డ్రైవర్‌ లైస్‌ మోడ్‌లో ఉన్నప్పుడు స్టీరింగ్‌ డ్యాష్‌బోర్డులోకి వెళ్లిపోతుంది.

దాని వల్ల ముందు భాగం విశాలంగా మారి.. కూర్చున్నవాళ్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక వెనుక సీటు చూశారుగా.. ఎంత బాగుందో.. స్టార్‌ హోటల్‌లోని సోఫాలో కూర్చున్నట్లు ఉంటుంది. అంతేకాదు.. ఈ సీటు మనం చెప్పినట్లు వింటుంది కూడా. పాటల సౌండ్‌ను తగ్గించాలన్నా పెంచాలన్నా.. సీటుపై చేతితో అలా చేస్తే చాలు పనై పోతుంది. అలాగే నేవిగేషన్‌ మ్యాప్‌ను జూమ్‌ చేయాలన్నా దీన్నే వాడుకోవచ్చు. దీని ద్వారా మరిన్ని ఆదేశాలు ఇచ్చేలా మార్పులు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాయిస్‌ కమాండ్స్‌ వంటివాటిని అందుబాటులోకి తేనుంది. పైభాగం అంతా పారదర్శకంగా ఉంటుంది. 2021లో మార్కెట్లోకి దీన్ని విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తలు