బీఎండబ్ల్యూ ‘320డీ ఎడిషన్‌ స్పోర్ట్‌’@ 38.6 లక్షలు

4 Aug, 2017 01:42 IST|Sakshi
బీఎండబ్ల్యూ ‘320డీ ఎడిషన్‌ స్పోర్ట్‌’@ 38.6 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తన ‘3–సిరీస్‌’ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇది తాజాగా కొత్త ‘బీఎండబ్ల్యూ 320డీ ఎడిషన్‌ స్పోర్ట్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.38.6 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ల) ఉంది. కంపెనీ ఈ కొత్త కారును చెన్నైలోని తన ప్లాంటులో అసెంబుల్‌ చేస్తోంది.

ఇందులో 2.0 లీటర్‌ ట్విన్‌పవర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.2 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. బీఎండబ్ల్యూ 320డీ ఎడిషన్‌ స్పోర్ట్‌లో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్, బ్రేక్‌ అసిస్ట్‌తో కూడిన యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (డీఎస్‌సీ), సైడ్‌ ఇంపాక్ట్‌ ప్రొటెక్షన్, క్రాష్‌ సెన్సార్, 8–స్పీడ్‌ స్టెప్‌ట్రోనిక్‌ స్పోర్ట్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది.  


డుకాటీ ‘స్క్రాంబ్లర్‌ కేఫ్‌ రేసర్‌’@ 9.32 లక్షలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్‌బైక్స్‌ తయారీ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా ‘స్క్రాంబ్లర్‌ కేఫ్‌ రేసర్‌’ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.32 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) ఉంది. యూరో–4 నిబంధనలకు అనువుగా రూపొందిన ఈ బైక్‌లో ట్విన్‌ సిలిండర్‌ 803 సీసీ ఇంజిన్, ప్రెజర్‌ సెన్సార్‌తో కూడిన బాష్‌ 9.1 ఎంపీ ఏబీఎస్‌ బ్రెంబో బ్రేకింగ్‌ సిస్టమ్, రేడియల్‌–టైప్‌ ఫ్రంట్‌ బ్రేక్‌ పంప్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. దేశంలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్స్‌ వద్ద ఈ సూపర్‌బైక్స్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 

మరిన్ని వార్తలు