ఏరోస్పేస్‌ రంగంలో ఆవిష్కరణలకు ఊతం

29 Nov, 2017 01:39 IST|Sakshi

టీ–హబ్‌తో బోయింగ్‌ భాగస్వామ్యం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హారిజోన్‌–ఎక్స్‌ ఇండియా ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ పేరుతో దేశంలో ఏరోస్పేస్‌ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చే కార్యక్రమానికి బోయింగ్‌ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టీ–హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అటానమస్, అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్‌ ఐవోటీ, ఆటోమేషన్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో క్లిష్ట సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తారు. 22 వారాలపాటు సాగే ఈ హంట్‌లో ఎంపికైన స్టార్టప్స్‌ తమ ఆలోచనకు తుదిరూపు ఇచ్చేందుకు టీ–హబ్‌లో మూడు నెలలపాటు యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌లో అవకాశం కల్పిస్తారు. స్టార్టప్‌ ఇండియా, బోయింగ్‌  బృందం, పరిశ్రమ నిపుణులు మెంటార్లుగా వ్యవహరిస్తారు. పోటీలో విజేతలకు భవిష్యత్తులో బోయింగ్‌తో భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది.

 ఏరోస్పేస్‌ రంగంలో పనిచేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలకు పెట్టుబడులతో మద్దతు ఇవ్వనున్నట్టు బోయింగ్‌ ఇండి యా ప్రెసిడెంట్‌ ప్రత్యూష్‌ కుమార్‌ మంగళవారమిక్కడ ఈ సందర్భంగా తెలిపారు. ఆవిష్కరణలకు ముఖ ద్వారంగా టీ–హబ్‌ నిలిచిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కాగా, బోయింగ్‌ హైదరాబాద్‌ కార్యలయం త్వరలో ప్రారంభం కానుంది. విస్తరణలో భాగంగా దేశంలో ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,200ల నుంచి 3,000లకు చేర్చనుంది.  

మరిన్ని వార్తలు