బంగారం కంటే ‘బాండ్లే’ బెటర్‌!

22 Oct, 2018 00:58 IST|Sakshi

పెట్టుబడికి సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు  

ఏటా 2.5 % వడ్డీ అదనపు ఆకర్షణ

గ్రాము బంగారం ఒక యూనిట్‌

ఎనిమిదేళ్ల కాల వ్యవధి

ఐదేళ్ల తర్వాత ముందుగానే తప్పుకోవచ్చు

బంగారం!! భారతీయ సంస్కృతి దీని చుట్టూ ఎంతలా అల్లుకుపోయిందో మాటల్లో చెప్పటం కష్టం. పిల్ల పెళ్లికోసం తను పుట్టినప్పటి నుంచే బంగారాన్ని కొనుగోలు చేసి కూడబెట్టడం మనకు కొత్తేమీ కాదు. అలాగే పెళ్లయినా, మరో కార్యక్రమమయినా బంగారాన్ని ధరించటమంటే స్టేటస్‌ సింబల్‌. ఎన్ని ఇబ్బందులొచ్చినా కొందరు ఇంట్లో ఉన్న బంగారం జోలికెళ్లరు. కొందరైతే బంగారాన్ని అవసరం కోసం వాడటం... మళ్లీ కొనటం చేస్తూనే ఉంటారు. ఇంతలా అల్లుకుపోయిన బంగారం... రాబడుల పరంగా ఈ మధ్య వన్నె తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా ధర పెరిగినా... ఇక్కడ రూపాయి అంతకన్నా ఎక్కువ పతనం కావటం ఒక కారణం.

ఇక సాంకేతికాంశాలు, దానికున్న ప్రాధాన్యం దృష్ట్యా ఒక దశకు చేరాక మళ్లీ పతనం కావటం... మళ్లీ పెరగటం జరుగుతోంది. కాకపోతే ఈక్విటీ మార్కెట్లు ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తున్నాయి. అంటే... మన పెట్టుబడి సైతం దారుణంగా కరిగిపోతున్న సందర్భాన్ని ఈ ఏడాది చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బంగారమన్నది సురక్షితమైన పెట్టుబడి సాధనమే. కాకుంటే పండగల సీజన్‌ కూడా వస్తున్న నేపథ్యంలో ఇలా బంగారం కొనదలచిన వారు.. భౌతిక బంగారం కాకుండా కేంద్రం అందిస్తున్న సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనొచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం వారు చెబుతున్న కారణాలేంటో ఒకసారి చూద్దాం...


నిజం చెప్పాలంటే బంగారాన్ని భౌతికంగా కన్నా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంచుకోవడం మెరుగైన ఆప్షన్‌. ఇలా చేయాలనుకున్న వారు... గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అందించే గోల్డ్‌ ఫండ్స్, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే, గోల్డ్‌ ఈటీఎఫ్, గోల్డ్‌ ఫండ్స్‌ ఈ రెండూ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అందించేవే. కనుక వీటి కొనుగోలుకు చార్జీలు చెల్లించాలి. కనీసం 0.6% నుంచి 1.2% మధ్యలో చార్జీలు, ఎక్స్‌పెన్స్‌ రేషియో రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింట్లో సార్వభౌమ బాండ్లు మంచి ఆప్షన్‌ అని చెప్పొచ్చు. వీటికి ఎలాంటి చార్జీలు లేవు. సరికదా ఏటా వడ్డీ రూపంలో కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.  

సార్వభౌమ బంగారం బాండ్లు అంటే?
వీటిని కేంద్రం తొలిసారి 2015లో ప్రారంభించింది. బంగారంలో పెట్టుబడులను ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మళ్లించడం ద్వారా, దిగుమతుల భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఆర్‌బీఐ ద్వారా ఆఫర్‌ చేస్తోంది. తరచూ వీటిని జారీ చేస్తున్న కేంద్రం... తాజా బంగారం ధర ఆధారంగా వీటి రేటును నిర్ణయిస్తోంది. ఈ మధ్య కూడా జారీ చేసింది. ఒక గ్రాము చొప్పున  విక్రయమయ్యే ఈ బాండ్లను బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కొనొచ్చు. దీని ఇన్వెస్టర్లు కేవైసీ నిబంధనలను పాటించాలి. ఇవి  డీమ్యాట్‌ రూపంలో ఉంటాయి.  

రాబడులిలా ఉంటాయి...
దేశీయ బంగారం ధరలకు అనుగుణంగానే బంగారం బాండ్ల ధర కూడా ఉంటుంది. పెట్టుబడులను వెనక్కి తీసుకునేటపుడు అంతకు మూడు రోజుల కిందట సగటు బంగారం (999 స్వచ్ఛత కలిగినది) ధర ఆధారంగా చెల్లిస్తారు. ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యుయలర్స్‌ అసోసియేషన్‌ ఈ ధరల్ని ప్రకటిస్తుంది. ఈ బాండ్ల విలువపై ఏటా 2.5 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఈ వడ్డీ ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాకు ఆరు నెలలకోసారి జమవుతుంది. కనీస పెట్టుబడి ఒక గ్రాము.

ఒక్కో వ్యక్తి సొంతంగా 4 కిలోల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో బాండ్లు కొనుగోలు చేయొచ్చు.  ట్రస్ట్‌లు, ఇతర సంస్థలకు ఈ పరిమితి 20 కిలోలు. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతీ గ్రాముపై ఆర్‌బీఐ రూ.50 తగ్గింపునిస్తోంది. బంగారం బాండ్ల ధర పెరగడం, తగ్గడం అన్నది మార్కెట్‌తోనే ముడిపడి ఉంటుంది. బంగారం ధరలు తగ్గినప్పుడు వడ్డీ ఆదాయం రూపంలో కొంత మేర పెట్టుబడి విలువకు రక్షణ ఉంటుంది. బంగారం మాదిరే బంగారం బాండ్లను కూడా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద హామీగా ఉంచి రుణాలను పొందొచ్చు.  

ఉపసంహరణ, పన్ను
సార్వభౌమ బంగారం బాండ్ల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒకవేళ ఏదైనా అత్యవసరం ఏర్పడి డబ్బులు అవసరమైతే... ఈ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత ముందుగానే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అయితే వడ్డీ చెల్లించడానికి కనీసం ఒక రోజు ముందు బ్యాంకు లేదా పోస్టాఫీసులో రెడీమ్‌ గురించి తెలియజేయాల్సి ఉంటుంది. డీమ్యాట్‌ రూపంలో కలిగి ఉంటే, స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లోనూ ట్రేడ్‌ అవుతాయి. బంగారం బాండ్లపై చేసే వడ్డీ చెల్లింపులు పన్ను ఆదాయం కిందకే వస్తాయి. పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఆదాయం శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, బంగారం పెట్టుబడిపై వచ్చిన మూలధన  లాభానికి పన్ను లేదు.

మరిన్ని వార్తలు