బుక్‌మైషోలో 270 ఉద్యోగాల కోత

29 May, 2020 13:06 IST|Sakshi

వైరస్‌ మహమ్మారి విజృంభణతో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బుక్‌మైషో కంపెనీ కూడా ఈ జాబితాలో చేరింది. కోవిడ్‌-19 కారణంగా త్వరలో తమ కంపెనీలో పనిచేస్తోన్న 1,450 మంది సిబ్బందిలో 20 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు బుక్‌మైషో ప్రకటించింది. దీంతో 270 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వైరస్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక అసమానతలు తగ్గించుకునేందుకు, ఈక్రమంలోనే ఖర్చులను అదుపుచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రాబోయే నెలల్లో చేపడతామని వివరించింది. ఇప్పటికే వేతనంలేని సెలవుల్లో ఉన్నవారు, ఉద్యోగాలు కోల్పోయినవారికి ఉద్యోగ ప్రమాణాల ప్రకారం అన్ని వైద్య, బీమా ,గ్రాట్యూటీ ఇతర అలవెన్సులు అందిస్తామని బుక్‌మైషో చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఆశిస్‌ హేమరాజని వెల్లడించారు. తద్వారా ఉద్యోగులకు ఆర్థిక సాయం అందుతున్నారు. ఇంకా కంపెనీలో కొన్ని టీమ్‌లు స్వచ్చందంగా 10 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించుకున్నాయని, బోనస్‌లను సైతం వదులకున్నాయని తెలిపారు. కంపెనీకి సంబంధించి ఇతర రకాల ఖర్చులను తగ్గించుకున్నట్లు ఆయన తెలిపారు. 
  కరోనా మహమ్మారి ప్రపంచదేశాల్లో విజృంభించి అనేక రకాల పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో లాక్‌డౌన్‌ చాల ముఖ్యమైనది. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తికి కొంత మేర అడ్డుకట్ట వేసినప్పటికీ.. మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, స్టేడియంలు, మాల్స్‌ మూతపడడం వల్ల, ఎక్కడివారు అక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఈ వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. నష్టాలను పూడ్చుకునేందుకు, వ్యయభారాలను కొంత మేర తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. గతవారంలో ఓలా, ఉబర్‌, జొమాటో, స్విగ్గీ, రోల్స్‌రాయిస్‌ వంటి కంపెనీలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

Related Tweets
మరిన్ని వార్తలు