కొనసాగిన రూపాయి ర్యాలీ

7 Mar, 2019 01:41 IST|Sakshi

డాలర్‌తో పోలిస్తే 21 పైసలు అప్‌

ముంబై: మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడుతున్నా.. ముడిచమురు రేట్ల తగ్గుదల తదితర అంశాల ఊతంతో రూపాయి ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజైన బుధవారం .. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 21 పైసలు బలపడి 70.28 వద్ద క్లోజయ్యింది. దేశీ ఈక్విటీల్లో భారీగా కొనుగోళ్లు జరగడం, విదేశీ నిధుల ప్రవాహం పెరగడం కూడా రూపాయి బలపడటానికి దోహదపడిందని ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొన్నారు. మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 43 పైసలు పెరిగింది. మొత్తం మీద రెండు రోజుల్లో దేశీ కరెన్సీ ఏకంగా 64 పైసలు బలపడినట్లయింది. 


మరోవైపు, డాలర్‌ ఇండెక్స్‌ (ఆరు కరెన్సీలతో డాలర్‌ విలువను పోల్చి చూసే సూచీ) 0.07 శాతం పెరిగి 96.92కి చేరింది. ‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల సమావేశం విఫలమయింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలకు సంబంధించిన పరిణామాలపై మార్కెట్‌ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో డాలర్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ బలంగా ట్రేడవుతోంది‘ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ చెప్పారు.    

మరిన్ని వార్తలు