వచ్చే పదేళ్లూ ఆకాశమే హద్దు

11 Sep, 2018 00:51 IST|Sakshi

విమానయాన రంగంలో బోలెడన్ని అవకాశాలు

ప్రస్తుతం ఇండిగోలో 181 విమానాలు; 3 నెలల్లో 200కు

తక్కువ ధర, సమయం, సులువైన నిర్వహణ పాటిస్తేనే సక్సెస్‌

ఐఎస్‌బీ సదస్సులో ఇండిగో డిసిగ్నేటెడ్‌ సీఈఓ గ్రేగొరీ టేలర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘అమెరికా జనాభా 33 కోట్లు. కానీ, అక్కడ వాణిజ్య విమానాల సంఖ్య 5 వేలు. ఇండియా జనాభా 120 కోట్లకు పైనే. కానీ, ఇక్కడ సేవలందిస్తున్న విమానాలు జస్ట్‌ 500–600 మాత్రమే! అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్ల జనాభా ఎక్కువున్న ఇండియాలో పది రెట్ల విమానాలు తిరగాల్సిన అవసరముంది. ఇదే దేశీ విమాన కంపెనీలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తుంది’’ అని ఇండిగో డిసిగ్నేటెడ్‌ సీఈఓ గ్రేగొరీ టేలర్‌ చెప్పారు.

వచ్చే పదేళ్ల వరకూ దేశీ విమానయాన పరిశ్రమలో విమాన కంపెనీలతో పాటు టెక్నాలజీ సంస్థలకూ అపారమైన వ్యాపార అవకాశాలుంటాయని తెలిపారు.శనివారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) లీడర్‌షిప్‌ సమ్మిట్‌–18లో ‘ఇండిగో... తర్వాత ఏంటి?’ అనే అంశంపై మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘‘రెండేళ్ల క్రితం ఇండిగో వద్ద 30–40 విమానాలుండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 180కి చేరింది.

ఈ ఏడాది ముగింపు నాటికి మరో 20 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చి మొత్తంగా 200కు చేరుస్తాం. 2006లో దేశీయ విమాన పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇండిగో.. ప్రస్తుతం 42 శాతం వాటాతో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం ఇండిగో వద్ద 42 న్యూ జనరేషన్‌ ఏ320 ఎన్‌ఈవో, 126 ఏ320 సీఈఓ, 10 ఏటీఆర్‌లు ఉన్నాయి. 48 డొమెస్టిక్, 9 ఇంటర్నేషనల్స్‌లో 57 గమ్యస్థానాల్లో సేవలందిస్తోంది.

టైమ్‌కు టేకాఫ్‌ అయితేనే..
ప్రపంచ విమానయాన పరిశ్రమలో ఇండియాది ఉత్సాహపూరితమైన మార్కెట్‌. తక్కువ టికెట్‌ ధరలు, సమయానికి టేకాఫ్, ల్యాండింగ్, సులువైన నిర్వహణ ఉంటేనే ఏ విమాన కంపెనీ అయినా సక్సెస్‌ అవుతుంది. ఇదే ఇండిగో సక్సెస్‌కు ప్రధాన కారణం. దేశంలో ఇండిగో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ తక్కువ టికెట్‌ ధర ఉంది. ద్రవ్యోల్బణం, ధరల స్థిరీకరణ వంటి కారణాలతో దేశంలో సగటు విమాన చార్జీలు 50 శాతం వరకు తగ్గిపోయాయి’’ అని టేలర్‌ వివరించారు.

విమానాలు పెంచితే సరిపోదు..
విమానయానంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కేవలం విమానాల సంఖ్యను పెంచితే సరిపోదని టేలర్‌ చెప్పారు. ‘‘అందుకు తగ్గట్టుగా టెక్నాలజీని వినియోగించుకొని సరికొత్త ఆవిష్కరణలను చేయాలి. సరికొత్త ఆవిష్కరణలే మేనేజ్‌మెంట్‌ నిర్వహణను మారుస్తాయి. స్థానిక ప్రజల అవసరాలు, సంస్కృతితో పోలిస్తే విమాన కంపెనీలకు మూలధనం సమస్య కాదు. దేశంలో విమానయాన కంపెనీలు ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను విస్తరించడం కంటే ఆయా కంపెనీల్లో సరైన సంస్కృతిని పెంచాలి. దీర్ఘకాలిక ఆలోచనలు చేయాలి’’ అని ఆయన సూచించారు.  

ఇండిగోలో కొత్త ఉద్యోగాలు..
పైలట్ల కొరతే ఏ విమాన సంస్థకైనా ప్రధాన సమస్యని, బోయింగ్‌ వంటి కంపెనీలకూ ఇదే సమస్య గా మారిందని ఐఎస్‌బీ సదస్సులో పాల్గొన్న ఇండిగో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మానవ వనరుల విభాగం) రాజ్‌ రాఘవన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పైలట్‌ రహిత విమానాలు ఆవిష్కరించినా.. అవి సక్సెస్‌ అవుతాయనేది సందేహమే. ఎందుకంటే పైలట్‌ లేకుండా ప్రయాణికులు ఎక్కుతారా? అనేది ప్రశ్నే’’ అని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండిగోలో 20 వేల మంది ఉద్యోగులున్నారని, పైలెట్స్, ఆపరేషన్స్, హెచ్‌ఆర్, బ్యాగేజ్‌ వంటి అన్ని విభాగాల్లోనూ కొత్త ఉద్యోగులను తీసుకోనున్నామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు