దుకాణాలను ఎత్తేసిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ స్టోర్స్‌

17 Jan, 2020 12:32 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం బోస్‌ రిటైల్‌ స్టోర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర అమెరికా, యూరప్‌, జపాన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 119 రిటైల్‌ దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆడియో, స్పీకర్లు, హెడ్‌ఫోన్స్‌ తదితర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులతో బోస్‌ రిటైలర్స్‌ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకుంది. 

తమ ఉత్పత్తులను దిగ్గజ కంపెనీలైన బెస్ట్‌ బై, అమెజాన్‌లు ఎక్కువ శాతం కొనుగోళ్లు చేశాయని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారన్న విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించలేదు.

బోస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోలెట్‌ బ్రూక్‌ స్పందిస్తూ.. కంపెనీ తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైనదని, అంతిమంగా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇన్నాళ్లు సహకరించిన తమ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా సీడీ, డీవీడీ, వినోద వ్యవస్థలకు సంబంధించిన ఉత్పత్తులకు కంపెనీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. 

కాగా గతేడాది 2019లో యుఎస్ రిటైలర్లు 9,302 స్టోర్లు మూసివేశారని వ్యాపార వర్గాలు తెలిపాయి. కోర్‌సైట్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదికలో 59శాతం రిటైల్‌ స్టోర్స్‌ను 2018లో మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం 16శాతం ఉన్న ఆన్‌లైన్‌ అమ్మకాలు 2026 నాటికి 25% కి పెరుగుతాయని యుబీఎస్ విశ్లేషకులు తమ పరిశోధనలో అంచనా వేశారు. 

చదవండి: అమెజాన్‌ డెలివరీ బాయ్‌ అఘాయిత్యం కేసులో కొత్త ట్విస్ట్‌!

>
మరిన్ని వార్తలు