బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు

24 Jun, 2020 16:35 IST|Sakshi

 'చైనా వస్తువులను బహిష్కరించండి':  దిగ్గజాలకు సీఏఐటీ లేఖ

 సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మరో కీలక అడుగు వేసింది. కరోనా విస్తరణ, సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక ఈ లేఖ రాసింది. చైనా వస్తువులను ఉపయోగించడం మానుకోవాలంటూ అంబానీ, టాటా, గోద్రేజ్, ప్రేమ్‌జీ, మిట్టల్‌కు తదితర 50 మంది  దిగ్గజాలనుద్దేశించి సీఏఐటీ ఈ లేఖ రాసింది.

భారత ప్రజలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా, భారతీయ పరిశ్రమ కెప్టెన్లలో ఒకరిగా భావిస్తారనీ తామూ అదే నమ్ముతున్నామని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే  ఈ సామూహిక ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది భారతదేశాన్ని 'స్వయం ఆధారిత భారత్' గా మార్చడానికి దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్నిస్తుందని  ప్రవీణ్ అభిప్రాయపడ్డారు.  

ఈ లేఖను పంపిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల జాబితాలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్,  అజీం ప్రేమ్ జీ,  కుమారం మంగళం బిర్లా,  ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమల్, విక్రమ్ కిర్లోస్కర్, సునీల్ భారతి మిట్టల్, రాహుల్ బజాజ్, శివ్ నాదర్, పల్లోంజి మిస్త్రీ, ఉదయ్ కోటక్, నుస్లీ వాడియా, శశి మధుకర్ పరేఖ్, హర్ష్ మారివాలా, డాక్టర్ సతీష్ రెడ్డి, పంకజ్ పటేల్ , నీలేష్ గుప్తా తదితరులు ఉన్నారు.

కాగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, సౌరశక్తి వంటి వ్యాపారాలు చైనా దిగుమతులు, ప్రధానంగా విడిభాగాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, ఔషధాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి, దీంతో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు మారుతి, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులను తగ్గించడం రాత్రికి రాత్రికి సాధ్యం కాదని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. 

గత 15 సంవత్సరాలకు పైగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడులు పెట్టాం. చాలా విశ్వసనీయమైన, స్నేహితులున్నారు.  అకస్మాత్తుగా నిలిపివేయాలంటే ఎలా అని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. ఒక సంస్థగా, దేశంగా ఇది ఎంత వరకు సబబో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మరోవైపు రాబోయే 3 సంవత్సరాల్లో ఆటోమోటివ్ రంగంలో విడి భాగాల దిగుమతులు, ఇతర సాధనాలపై ఆధారపడటాన్ని సగానికి తగ్గించడం సాధ్యమని ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. 

చైనాలోని వ్యూహాన్ నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, సరిహద్దు వెంబడి చైనా దుశ్చర్య కారణంగా గాల్వన్ ప్రావిన్స్‌లో 20 మంది సైనికుల మరణం తరువాత చైనా బహిష్కరణ ప్రచారాన్ని సీఏఐటీ  ఉధృతం చేసింది. దాదాపు 500 ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. 2021 డిసెంబర్ నాటికి 100,000 కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) రూపాయల దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20లో చైనా నుండి 65.26 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంది. 2019-20లో 81.86 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఇండియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 

మరిన్ని వార్తలు