ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!

3 Jan, 2020 03:22 IST|Sakshi

బీపీసీఎల్, కంటైనర్‌ కార్పొల్లో కూడా 

దీపమ్‌ ఉన్నతాధికారి వెల్లడి  

ముంబై: ఎయిరిండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్‌ ఇండియాతో పాటు బీపీసీఎల్, కంటైనర్‌ కార్పొరేషన్‌ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.  

వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం....
ఎయిరిండియా, బీపీసీఎల్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయని  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ కంపెనీల వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక వివరాలను సిద్ధం చేస్తున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదనపు వివరాలను అడుగుతున్నాయని వివరించారు. మరోవైపు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ స్వల్ప నష్టంతో             ఎన్‌ఎస్‌ఈలో లిస్టయింది.  

సగం కూడా సాకారం కాని లక్ష్యం.....
ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ దీంట్లో సగం కూడా సమీకరించలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ.12,359 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరోవైపు ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలను మించింది. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికి, ఇప్పటికే ద్రవ్యలోటు 115%కి ఎగబాకింది.  

బీపీసీఎల్‌ వాటా రూ.60,000 కోట్లు.
బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయి.  షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు లభించనున్నాయి. ఇక కంటైనర్‌ కార్పొ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.13,000 కోట్లు లభించే        అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు