బీపీసీఎల్, ఎయిరిండియా విక్రయం 

19 Nov, 2019 03:34 IST|Sakshi

మార్చి నాటికి పూర్తి: సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), విమానయాన సంస్థ ఎయిరిండియాల విక్రయం సాధ్యమైనంత వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ముగించాలని కేంద్రం యోచిస్తోంది. మార్చి నాటికల్లా అమ్మకం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎయిరిండియాపై చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు.

ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇది రెండోసారి. 76%వాటాలను అమ్మేందుకు గతేడాది ప్రయత్నించినప్పటికీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో విరమించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా కేంద్రం గత ఐదేళ్లలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని, ఇవి 2024–25 నాటికి భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు తోడ్పడతాయని సోమవారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

వ్యాపారానికి మరింత వెసులుబాటు
దేశంలో వ్యాపార నిర్వహనకు మరింత సులభతరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి బృందం– కంపెనీ లా కమిటీ సూచించింది. ఈ మేరకు కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్‌ నేతృత్వంలోని కమిటీ  నివేదికను కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమరి్పంచింది.

>
మరిన్ని వార్తలు