విదేశీ ఆసక్తి: చమురు షేర్లకు డిమాండ్‌

17 Jul, 2020 13:47 IST|Sakshi

బీపీసీఎల్‌లో వాటా విక్రయ ఎఫెక్ట్‌

10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు బీపీసీఎల్‌

7 శాతం జంప్‌చేసిన హెచ్‌పీసీఎల్‌ షేరు

3 శాతం లాభంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్ప్‌

ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో వాటా కొనుగోలుకి గ్లోబల్‌ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్న వార్తలతో పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేరు తొలుత 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 39 ఎగసి రూ. 433 ఎగువన ఫ్రీజయ్యింది. ఈ‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. ఉదయం 11.40 కల్లా ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 1.6 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో భాగంకావడంతో బీపీసీఎల్‌ కౌంటర్‌.. తదుపరి సర్క్యూట్‌ నుంచి రిలీజ్‌అయ్యింది. ప్రస్తుతం 11 శాతం ఎగసి రూ. 437 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 442ను తాకింది.
 
2 రోజులుగా..
వాటా విక్రయ వార్తల నేపథ్యంలో గత రెండు రోజుల్లో  బీపీసీఎల్‌ షేరు 14 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఈ బాటలో ప్రస్తుతం హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 224 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) సైతం 3 శాతం లాభపడి రూ. 87 వద్ద కదులుతోంది. ఇతర  వివరాలు చూద్దాం..

సౌదీ అరామ్‌కో..
ఇంధన రంగ పీఎస్‌యూ.. బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి  ప్రభుత్వం ఇటీవల ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఆసక్తి ఉన్న కంపెనీలకు ఆహ్వానం(ఈవోఐ) పలికింది. ఇందుకు ఈవోఐలను దాఖలు చేసేందుకు ఈ నెల(జులై) 31వరకూ గడువు ఇచ్చింది. బీపీసీఎల్‌ కొనుగోలుకి విదేశీ ఇంధన దిగ్గజాలు సౌదీ అరామ్‌కో, రాస్‌నెఫ్ట్‌, ఎగ్జాన్‌ మొబిల్‌, అబుధబీ నేషనల్‌ ఆయిల్‌ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం  బీపీసీఎల్‌లో ఉన్న 114.9 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. వెరసి 52.98 శాతం వాటా విక్రయం ద్వారా కొనుగోలుదారుకు యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనుంది.  అయితే నుమాలిగఢ్‌ రిఫైనరీలో బీపీసీఎల్‌కున్న 61.65 శాతం వాటాను మరో ఆయిల్‌ పీఎస్‌యూకు ప్రభుత్వం బదిలీ చేయనుంది. 

మరిన్ని వార్తలు