దిగ్గజాల రివర్స్‌గేర్‌!

2 May, 2019 00:00 IST|Sakshi

మారుతీ విక్రయాల్లో 19% క్షీణత

23 శాతం తగ్గిన హ్యుందాయ్‌ అమ్మకాలు..

ఏప్రిల్‌ నెలలో వాహన రంగానికి బ్రేకులు..

న్యూఢిల్లీ:  ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో వాహన రంగానికి కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోగా.. హోండా మాత్రం 23 శాతం వృద్ధిని నమోదుచేసింది. ద్విచక్ర వాహనాల్లో.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సేల్స్‌ 17 శాతం క్షీణించగా.. సుజుకీ మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 12.57 శాతం పెరిగాయి. ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్‌ 15 శాతం తగ్గుదలను నమోదుచేసింది. 

మారుతీ వేగం తగ్గింది... 
ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విభాగంలో 50 శాతానికి మించి మార్కెట్‌ వాటాను కలిగి మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 18.7 శాతం తగ్గుదలను నమోదుచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ సంస్థ విక్రయాలు 1,43,245 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఏప్రిల్‌లో 1,72,986 యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థకు చెందిన మినీ కార్‌ ఆల్టో అమ్మకాలు 39.8 శాతం తగ్గి 22,766 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్‌ విభాగం 13.9 శాతం తగ్గింది. యుటిలిటీ వాహనాల విక్రయాలు మాత్రం 5.9 శాతం వృద్ధి చెందాయి. ఎగుమతులు 14.6 శాతం పెరిగి 9,177 యూనిట్లుగా వెల్లడయ్యాయి. ఇంధన ధరలు పెరగడం, బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనల అమలు వంటి ప్రతికూల అంశాల కారణంగా ఈ ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయని సంస్థ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. మరోవైపు హ్యుందాయ్‌ అమ్మకాలు 23 శాతం తగ్గి 42,005 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో ఈ సంస్థ 46,735 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. 

స్పీడుమీదున్న హోండా 
హోండా కార్స్‌ దేశీ అమ్మకాలు 23 శాతం వృద్ధితో 9,143 యూనిట్ల నుంచి 11,272 యూనిట్లకు చేరాయి. అమ్మకాలు పెరగడానికి లోయర్‌ బేస్‌ ఎఫెక్ట్, అమేజ్‌ బలమైన విక్రయాలు కారణమని సంస్థ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్, డైరెక్టర్‌ (సేల్‌ అండ్‌ మార్కెటింగ్‌) రాజేశ్‌ గోయెల్‌ వెల్లడించారు.  

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు స్పీడు బ్రేకులు 
లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఏప్రిల్‌ దేశీ అమ్మకాలు 21% తగ్గి 59,137 యూనిట్లుగా వెల్లడయ్యాయి. ఎగుమతులు 140% పెరిగిన కారణంగా మొత్తం అమ్మకాలు 17% క్షీణితను నమోదుచేశాయి. ఇక సుజుకీ మోటార్‌సైకిల్‌ విక్రయాలు 12.57% పెరిగి 65,942 యూనిట్లుగా నమోదుకాగా, ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్‌ విక్రయాలు 15% తగ్గి 5,264 యూనిట్లుగా నమోదయ్యాయి.

హీరో మోటొకార్ప్‌ నుంచి మూడు ప్రీమియం బైక్‌లు
ప్రారంభ ధర రూ.94,000 
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’.. తాజాగా మరో మూడు ‘ఎక్స్‌’ రేంజ్‌ ప్రీమియం బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్స్‌ పల్స్‌ 200 టీ, ఎక్స్‌ పల్స్‌ 200, ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్‌ ధరలు వరుసగా రూ.94,000, రూ.97,000, రూ.1.05 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. గతేడాది పండుగ సీజన్‌లో ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ పేరిట తన తొలి ఎక్స్‌ సిరీస్‌ ప్రీమియం బైక్‌లను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ.. మరో మూడు బైక్‌లను ఈ శ్రేణిలో విడుదల చేయడం ద్వారా సిరీస్‌ సంఖ్యను నాలుగుకు పెంచింది. ఈ సందర్భంగా సంస్థ సేల్స్‌ హెడ్‌ సంజయ్‌ భన్‌ మాట్లాడుతూ.. ‘యువత లక్ష్యంగా నెమ్మదిగా ప్రీమియం మోటార్‌ సైకిల్‌ విభాగంలో మా ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే 3–4 ఏళ్లలో మరింత విస్తరించనున్నాం’ అని వివరించారు.   

‘ఒకినావా’కు ఫేమ్‌–2 రాయితీ 
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఒకినావా స్కూటర్స్‌ తన పోర్ట్‌ఫోలియోలోని రెండు మోడళ్లకు ఫేమ్‌–2 రాయితీ వెసులుబాటు దక్కిందని బుధవారం ప్రకటించింది. కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)ఆధారంగా ఒకినావా రిడ్జ్‌ ప్లస్, ఐ–ప్రెయిజ్‌ స్కూటర్లకు రూ.17,000 నుంచి రూ.26,000 వరకు సబ్సిడీ వర్తిస్తుందని సంస్థ ఎండీ జితేందర్‌ శర్మ చెప్పారు. ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) నుంచి ఈమేరకు అర్హత ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు వెల్లడించారు. సబ్సిడీలు ఇవ్వడం ద్వారా విద్యుత్, హైబ్రిడ్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రెండో విడత ఫేమ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ స్కీంలో భాగంగా 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వనుంది.   

మరిన్ని వార్తలు