మూడు రోజుల తరవాత...

5 Jan, 2018 00:19 IST|Sakshi

నష్టాలకు బ్రేక్‌; 10,500 పాయింట్లపైకి నిఫ్టీ

62 పాయింట్ల లాభంతో 10,505  వద్ద ముగింపు

176 పాయింట్లు పెరిగి 33,970కు సెన్సెక్స్‌ 

కొత్త సంవత్సరంలో తొలిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. బ్యాంక్‌ల మూలధన నిధులకు సంబంధించి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయడం, లోహ షేర్ల జోరు స్టాక్‌ మార్కెట్‌ను లాభాల వైపు నడిపించాయి. అంతర్జాతీయ అంశాలు కలసిరావడం, భారత సేవల రంగం పీఎంఐ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 176 పాయింట్ల లాభంతో 33,970 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 10,505 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది నిఫ్టీ 10,500 పాయింట్లపైకి చేరడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌ 119 పాయింట్లు ఎగసి 33,912 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది.  ఇంట్రాడేలో 202 పాయింట్ల లాభంతో 33,995 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. 

బ్యాంకులకు రూ.80 వేల కోట్ల మూలధన బాండ్లు...
మొండి బకాయిలతో కుదేలైన బ్యాంక్‌లను ఆదుకునే నిమిత్తం రూ.80,000 కోట్ల మూలధన బాండ్లకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌  ఆమోదం కోరింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ 1.7 శాతం పెరగ్గా, యూకో బ్యాంక్, ఐడీబీఐ, పంజాబ్‌ నేషనల్‌బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేర్లు 9 శాతం వరకూ ఎగిశాయి. గత ఏడాది నవంబర్‌లో 48.5 గా ఉన్న భారత సేవల రంగం పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు గత నెలలో 50.9కు పెరగడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డిసెంబర్‌ పీఎంఐ గణాంకాలు మెరుగుపడటంతో స్టాక్‌ మార్కెట్‌ స్తబ్దత నుంచి బైటపడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు. 

ఏడాది చివరికల్లా నిఫ్టీ 11,500!:డాషే బ్యాంక్‌
ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా నిఫ్టీ 11,500 పాయింట్లకు, సెన్సెక్స్‌ 37,000 పాయింట్లకు చేరుతాయని  డాషే బ్యాంక్‌ అంచనా వేస్తోంది. కంపెనీల ఆర్థిక ఫలితాలు పటిష్టంగా ఉండనుండటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. గత ఏడాది ప్రపంచ మార్కెట్లలాగానే భారత మార్కెట్‌ కూడా మంచి లాభాలు సాధించిందని, ఒడిదుడుకులు స్వల్పంగా చోటు చేసుకున్నాయని వివరించింది. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి(స్వల్ప ఒడిదుడుకులు) ఉండకపోవచ్చని పేర్కొంది. చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్లకు మించి పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని విశ్లేషించింది.  

మరిన్ని వార్తలు