మార్కెట్లో అప్రమత్తత 

11 May, 2018 01:10 IST|Sakshi

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల  లాభాలకు బ్రేక్‌ 73 పాయింట్లు పడిపోయి  35,246కు సెన్సెక్స్‌ 

25 పాయింట్ల  పతనంతో 10,717కు నిఫ్టీ  

మూడు వరుస ట్రేడింగ్‌ సెషన్ల లాభాలకు గురువారం బ్రేక్‌ పడింది. ముడి చమురు ధరలు భగ్గుమనడం, డాలర్‌తో రూపాయి మారకం 15 నెలల కనిష్ట స్థాయికి క్షీణించడం ప్రతికూల ప్రభావం చూపించడంతో స్టాక్‌సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, కర్ణాటకలో శనివారం ఎన్నికలు జరుగుతుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, గురువారం వెలువడిన కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌73 పాయింట్లు నష్టపోయి 35,246 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు క్షీణించి 10,717 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ బ్యాంక్, లోహ, ఫార్మా, వాహన, ఇన్‌ఫ్రా షేర్లలో అమ్మకాలు జరిగాయి.  

297 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైంది. ప్రారంభంలో కొనుగోళ్ల జోరుతో 182 పాయింట్ల లాభంతో 35,501 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత అమ్మకాలు తీవ్రం కావడంతో నష్టాల్లోకి జారిపోయింది. 115 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 35,204 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద 297 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అంతకు ముందటి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 404 పాయింట్లు లాభపడింది. ఇరాన్‌పై అమెరికా తాజాగా ఆంక్షలు విధించడంతో చమురు సరఫరాలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయన్న అంచనాలతో ముడి చమురు ధరలు ఎగిశాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు దర 77.76 డాలర్లకు పెరిగింది. 2014, నవంబర్‌ తర్వాత ఇదే అత్యంత గరిష్ట స్థాయి. ఆయిల్, గ్యాస్‌ షేర్లు ట్రేడింగ్‌లో చాలా భాగం నష్టపోయినప్పటికీ, చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.  

‘ఫ్యూచర్‌’ షేర్లకు ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ జోష్‌... 
ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను  అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన నేపథ్యంలో రిటైల్‌ రంగ షేర్లు దూసుకుపోయాయి. ఆన్‌లైన్‌ సంస్థలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని ఫ్యూచర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కిశోర్‌ బియానీ వెల్లడించడంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు–ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్, ఫ్యూచర్‌ రిటైల్, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్, ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ షేర్లు 3–18 శాతం రేంజ్‌లో పెరిగాయి.   

మరిన్ని వార్తలు