మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌

22 Feb, 2018 00:51 IST|Sakshi

ఐటీ షేర్లకు లాభాలు 

ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ 

141 పాయింట్ల లాభంతో 33,845కు సెన్సెక్స్‌

37 పాయింట్ల లాభంతో 10,397కు నిప్టీ

ఐటీ షేర్లలో కొనుగోళ్లు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రికవరీ కావడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. దీంతో వరుస మూడు ట్రేడింగ్‌ సెషన్ల నష్టాలకు బ్రేక్‌ పడింది. ఐటీ షేర్లతో పాటు ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆయిల్, గ్యాస్‌ షేర్లు పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంతో 33,845 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 10,397 పాయింట్ల వద్ద ముగిశాయి.  సానుకూలముగా అంతర్జాతీయ సంకేతాలు  ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం, గురువారం  నాడు ఫిబ్రవరి సిరీస్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపాయి. కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 208 పాయింట్లు లాభంతో 33,911 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 1 పాయింటు నష్టంతో 33,703 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్థిక రంగ, పీఎస్‌యూ, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడటంతో చివరకు 141 పాయింట్ల లాభంతో ముగిసింది. 

ఐటీ షేర్లు అప్‌..
డిజిటల్‌ టెక్నాలజీల జోరుతో ఐటీ కంపెనీలకు మంచి అవకాశాలు అందనున్నాయన్న నాస్కామ్‌  అంచనాలు ఐటీ షేర్లను లాభాల బాట వైపు నడిపించాయి.  టీసీఎస్‌ 3.3 శాతం లాభంతో రూ.3,043 వద్ద ముగిసింది. ఐటీసీ 2 శాతం, ఓఎన్‌జీసీ 1.6 శాతం చొప్పున పెరగ్గా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, కోటక్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్, కోల్‌ ఇండియా షేర్లు 1 శాతం వరకూ లాభపడ్డాయి. సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్తాన్‌ యూనిలివర్, పవర్‌ గ్రిడ్, ఏషియన్‌ పెయింట్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోవడంతో లాభాలు పరిమితమయ్యాయి.

గీతాంజలి జెమ్స్‌ మరో 10 శాతం డౌన్‌..
గీతాంజలి జెమ్స్‌ నష్టాలు వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగాయి. కంపెనీని మూసివేస్తున్నట్లు ఉద్యోగులకు వర్తమానం అందిందన్న వార్తల నేపథ్యంలో ఈ షేర్‌ 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌తో రూ.27.46కు పడిపోయింది.  

మరిన్ని వార్తలు