బంగారం, వెండి పైపైకి..

7 Jul, 2016 00:14 IST|Sakshi
బంగారం, వెండి పైపైకి..

ఎంసీఎక్స్‌లో రూ. 32,000 దాటిన పసిడి
రూ. 48,000పైకి వెండి

న్యూఢిల్లీ/న్యూయార్క్ : ఫైనాన్షియల్ మార్కెట్లలో మళ్లీ బ్రెగ్జిట్ భయాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించే పసిడి ధర మంగళ, బుధవారాల్లో ప్రపంచ మార్కెట్లో దూసుకుపోయింది. ఈ రెండు రోజుల్లో ఔన్సు ధర 40 డాలర్ల వరకూ పెరిగి 1,377 డాలర్ల స్థాయిని చేరింది. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ మన దేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బుధవారం రాత్రి 10 గ్రాముల ధర రూ. 32,000 స్థాయిని అధిగమించింది. కడపటి సమాచారం అందేసరికి ప్రపంచ మార్కెట్లో 1,372 డాలర్ల వద్ద, ఎంసీఎక్స్‌లో రూ. 32,260 వద్ద ట్రేడవుతోంది. కాగా రంజాన్ సందర్భంగా ముంబై, హైదరాబాద్‌ల్లో స్పాట్ బులియన్ మార్కెట్లకు సెలవు.

దేశరాజధాని ఢిల్లీ బులియన్ స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి బుధవారం ఒక్కరోజే రూ. 400 వరకూ పెరిగి రూ. 31,050 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో ప్రపంచ మార్కెట్ ధర ప్రకారం పుత్తడి ధర పలుకుతుండగా, స్పాట్ మార్కెట్లో కొద్ది వారాల నుంచి డిస్కౌంట్‌లో లభిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడుల డిమాండ్ మినహా భౌతిక కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ ట్రేడర్లు ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో తక్కువ ధరకు పసిడిని విక్రయిస్తున్నారు.

 వెండిదీ అదే బాట...: పుత్తడి బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 21 డాలర్ల స్థాయిని చేరగా, ఎంసీఎక్స్‌లో కేజీ ధర రూ. 48,000 స్థాయిని దాటింది. కడపటి సమాచారం ప్రకారం ఈ స్థాయి నుంచి వెండి కాస్త దిగి రూ. 47,900 వద్ద ట్రేడవుతోంది.

 ఆర్థిక వ్యవస్థ పట్ల భయాలు
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన(బ్రెగ్జిట్) ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్న భయాలు ఇన్వెస్టర్లలో తిరిగి తలెత్తాయని, దాంతో విలువైన లోహాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తున్నారని బులియన్ విశ్లేషకులు చెప్పారు. జపాన్ నుంచి అమెరికా దాదాపు అన్ని స్టాక్ మార్కెట్లూ క్షీణించగా, బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి జారిపోయింది. డాలరు మారకంలో ఈ విలువ 1.28 డాలర్లకు పడిపోయింది. బ్రెగ్జిట్ రిఫరెండంకు ముందు ఇది 1.5 డాలర్లు వుండేది. ఇందుకు తగ్గట్లే చైనాతో సహా వర్థమాన దేశాల కరెన్సీ విలువలు పతనంకాగా, అమెరికా డాలరు, జపాన్ యెన్ బలపడ్డాయి. ఈ అంశాలన్నీ పుత్తడి ర్యాలీకి కారణమయ్యాయి.

>
మరిన్ని వార్తలు