టాటా మోటార్స్ లాభం 57% డౌన్

27 Aug, 2016 00:56 IST|Sakshi
టాటా మోటార్స్ లాభం 57% డౌన్

క్యూ1లో రూ.2,260 కోట్లు...
బ్రెగ్జిట్తో జేఎల్‌ఆర్‌పైవిదేశీ మారక ప్రభావం

 ముంబై: దేశీ వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో 57 శాతం దిగజారింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,254 కోట్లుగా నమోదుకాగా, ఇప్పుడిది రూ.2,260 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) వల్ల కంపెనీ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్)పై విదేశీ మారకానికి సంబంధించి ప్రతికూల ప్రభావం పడటంతో లాభాలు దిగజారినట్లు కంపెనీ పేర్కొంది. కాగా, క్యూ1లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.66,101 కోట్లకు పెరిగింది.

క్రితం ఏడాది ఇదే కాలానికి ఆదాయం రూ.60,094 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి చెందింది. జేఎల్‌ఆర్ బిజినెస్‌కు సంబంధించి ఫారెక్స్ ప్రతికూల ప్రభావం(బ్రెగ్జిట్ తర్వాత పౌండ్ విలువ పతనం వల్ల) రూ.2,296 కోట్లతో పాటు కమోడిటీ డెరివేటివ్స్ కారణంగా మరో రూ.167 కోట్ల మేర నిర్వహణ లాభంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అయితే, తమ స్టాండెలోన్ సేల్స్‌తో పాటు జేఎల్‌ఆర్‌కు సంబంధించి అమ్మకాలు పుంజుకోవడంతో కొంతమేర దీన్ని పూడ్చుకోగలిగామని తెలిపింది.

 91 శాతం పడిపోయిన స్టాండెలోన్ లాభం...
ఒక్క టాటా మోటార్స్ బిజినెస్(స్టాండెలోన్)ను చూస్తే.. క్యూ1లో నికర లాభం 91 శాతం క్షీణించి రూ.96 కోట్లకు దిగజారింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.290 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం రూ.10,263 కోట్ల నుంచి రూ.11,311 కోట్లకు పెరిగింది. 10 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ మొత్తం(ఎగుమతులు సహా) 1,26,839 వాహనాలను(8% వృద్ధి) విక్రయించింది.

ఇతర ముఖ్యాంశాలివీ...
బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్ నికర లాభం క్యూ1లో 30.4 కోట్ల పౌండ్లుగా నమోదైంది. క్రితం క్యూ1లో 49 కోట్ల పౌండ్లతో పోలిస్తే 38 శాతం తగ్గింది. కాగా, ఆదాయం మాత్రం 500 కోట్ల పౌండ్ల నుంచి 546 కోట్ల పౌండ్లకు పెరిగింది.

జేఎల్‌ఆర్ క్యూ1లో మొత్తం 1,20,776 వాహనాలను విక్రయించింది.

ఇక చైనా జాయింట్ వెంచర్(జేవీ) అమ్మకాలు 13,558గా నమోదయ్యాయి.

రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదనకు ఈ నెల 9న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఇప్పటికే వాటాదారులు ఓకే చెప్పారు.

కాగా, ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 2 శాతం  లాభంతో రూ. 504 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 4.5 శాతం ఎగబాకి రూ.515 గరిష్టాన్ని కూడా తాకడం గమనార్హం.

మరిన్ని వార్తలు