కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బ్రెగ్జిట్ షాక్ ?

25 Jun, 2016 16:53 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బ్రెగ్జిట్ షాక్ ?

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని కుదిపేసిన బ్రెగ్జిట్ ఉదంతం  కేంద్ర  ప్రభుత్వం ఉద్యోగులకు కూడా  భారీ షాక్ ఇవ్వనుంది.  సుదీర్ఘ కాలంగా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న ఏడవ ఆర్థిక కమిషన్  అమలు  ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.  తొందర్లోనే అమలుకు నోచుకుంటుం దనుకుంటున్న 7వ వేతన సంఘం కమిషన్ సిఫారసుల అమలు  మరో 2-3 నెలల జాప్యం  కావచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.   ఈ చెల్లింపులు భారం ప్రభుత్వ ఖజానాపై  భారీగా పడనుందనీ,  దేశీయ మార్కెట్లలో పెరిగిన అస్థిరత నేపథ్యంలో  దీని అమలు ఆలస్యం కావచ్చని విశ్లేషకులు  భావిస్తున్నారు
 
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఫలితంగా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిణామాల కారణంగా మన మార్కెట్ల  స్థిరీకరణకు మరొక 2-3 నెలలు పట్టవచ్చని  తెలిపారు.   ఈ నేపథ్యంలో  చెల్లింపుల జాప్యానికి  బలమైన అవకాశం ఉందని  మార్కెట్ నిపుణులు అంచనావేశారు. తత్ఫలితంగా వచ్చే ద్వైమాసిక ఆర్బీఐ  ద్రవ్య విధాన  సమీక్ష కూడా మరికొంతకాలం వాయిదా పడొచ్చంటున్నారు.  అలాగే చెక్కుచెదరకుండా  యథాతథంగా ఉంటాయని అంచనా వేస్తున్నవడ్డీ రేట్లలో స్వల్ప పెంపు ఉండే  అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

దేశీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకొని స్థిరపడేదాకా , అంటే సుమారు మరో మూడు నెలలు ప్రభుత్వం వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంబించవచ్చని  విశ్లేషకులు భావిస్తున్నారు.  మార్కెట్ లో మరింత అస్థిరత పెరిగితే  ఆర్థిక పరిస్థితి, రూపాయి మరింత బలహీనతపడుతుందని చెబుతున్నారు. 

కాగా బ్రెగ్జిట్  నిర్ణయంతో, ప్రపంచ మార్కెట్ల సంక్షోభం, పౌండ్ ధర  రికార్డు  క్షీణత, ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో దాదాపు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు