బ్రిటన్‌లో ‘ఆసియా’ కుబేరులు హిందుజాలు

13 Apr, 2014 04:21 IST|Sakshi
బ్రిటన్‌లో ‘ఆసియా’ కుబేరులు హిందుజాలు

 లండన్: పారిశ్రామిక దిగ్గజాలు హిందుజా సోదరులు.. వరుసగా రెండవ ఏడాదీ బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న ఆసియన్లుగా నిల్చారు. 13.5 బిలియన్ పౌండ్లకు పైగా (సుమారు రూ. 1,36,000 కోట్లు) సంపదతో ఆసియన్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే వారి సంపద బిలియన్ పౌండ్లు పెరిగింది.

ఆసియన్ మీడియా అండ్ మార్కెటింగ్ గ్రూప్‌కి చెందిన ఈస్టర్న్‌ఐ ప్రచురణ సంస్థ రూపొందించిన ఆసియన్ రిచ్ లిస్ట్ 101 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 12 బిలియన్ పౌండ్ల సంపదతో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 2వ స్థానంలో నిల్చారు. ఇక, 750 మిలియన్ పౌండ్ల సంపదతో ఎన్నారై పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ 10వ స్థానంలో ఉన్నారు.

కాగా హిందుజా గ్రూప్.. ఆసియన్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. అటు టాటా గ్రూప్.. ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డును అందుకుంది. బ్రిటన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రిటన్ విద్యా మంత్రి మైఖేల్ గోవ్ ఈ పురస్కారాలను అందజేశారు. సంపన్నుల జాబితాలోని 101 మంది కుబేరుల మొత్తం సంపద 52 బిలియన్ పౌండ్ల మేర ఉంటుంది. ఇది 2013తో పోలిస్తే 6 బిలియన్ పౌండ్లు అధికం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు