10 వేల మందిని తొలగించక తప్పదు! 

21 Aug, 2019 11:55 IST|Sakshi

సంక్షోభంలో బిస్కట్‌ పరిశ్రమ

అధిక జీఎస్‌టీ, క్షీణించిన డిమాండ్‌

జీఎస్‌టీనుంచి తగ్గించండి - బ్రిటానియా

లేదంటే  8-10వేల ఉద్యోగాల కోత తప్పదు - బ్రిటానియా

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద బిస్కెట్‌ తయారీ కంపెనీ  బ్రిటానియా ఇండస్ట్రీస్  షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.  భారీగా పతనమైన డిమాండ్‌,  జీఎస్‌టీ భారంతో 8నుంచి 10వేల మంది ఉద్యోగులను  తీసివేయాలని  చూస్తున్నామని బ్రిటానియా వెల్లడించింది.  పార్లే ఉత్పత్తుల  కేటగిరీ హెడ్ మయాంక్‌ షా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  బిస్కట్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న18శాతం జీఎస్‌టీ  తలకుమించిన భారంగా ఉందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ,  జీఎస్టీ కౌన్సిల్‌ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కిలోకు రూ .100 లేదా అంతకంటే తక్కువ ధర గల  బిస్కట్‌ ప్యాకెట్లపై  జీఎస్‌టీ తగ్గించాలని  మయాంక్‌ షా  డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు  చేపట్టకపోతే  ఉద్యోగాల కోత తప్ప తమకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అటు భారీగా పడిపోయిన డిమాండ్‌, అధిక జీఎస్‌టీ రేటు మొత్తం బిస్కట్ల  పరిశ్రమను దెబ్బతీస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిస్కట్లపై జీఎస్‌టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరుతోంది.

జూన్ 30, 2019 తో ముగిసిన త్రైమాసికంలో, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏకీకృత నికర అమ్మకాలలో సంవత్సరానికి 5.9 శాతం  (వార్షిక ప్రాతిపదికన)వృద్ధిని 2,677.3 కోట్ల రూపాయలుగా నమోదు చేయగా, నికర లాభం 3.7 శాతం తగ్గి 248.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. బ్రిటానియా  గ్రామీణ వ్యాపారం, పట్టణాల కంటే వేగంగా పెరిగేది. కానీ ఈ త్రైమాసికంలో క్షీణించింది. ఈ త్రైమాసికంలో కేవలం 3 శాతం వృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా బ్రిటానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ మాట్లాడుతూ వినియోగదారుడు కేవలం రూ. 5 బిస్కట్‌ ప్యాకెట్‌ కొనడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారనీ, ఇది తమ లాభాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తోందన్నారు. సహజంగానే, ఆర్థిక వ్యవస్థలో కొన్ని తీవ్రమైన సమస్య ఉందని మిస్టర్ బెర్రీ  వ్యాఖ్యానించారు. మాట్లాడుతూజూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన రోజు ఆగస్టు 9 నుండి కంపెనీ షేర్లు దాదాపు 7.5 శాతం (మంగళవారం ముగిసే నాటికి) పతనమైంది. బుధవారం కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. 

కాగా  భారత ఆర్థిక  వ్యవస్థ మందగమనంపై ఆర్‌బీఐ మాజీ  గవర్నర్‌ రఘురామ రాజన్‌ సహా, పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 5.4 - 5.6 శాతం మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు. అంటే ఇది ఐదేళ్ల కనిష్టం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం,  అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, గ్లోబల్‌  మార్కెట్ పరిస్థితులు, దేశీయంగా ఆటో మొబైల్ రంగంలో తీవ్ర సంక్షోభానికి తోడు ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ లాంటి కీలక రంగాల్లో మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా