బ్లూచిప్స్ ఫలితాలే దిక్సూచి..!

25 Jan, 2016 00:56 IST|Sakshi
బ్లూచిప్స్ ఫలితాలే దిక్సూచి..!

ఒడిదుడుకులు కొనసాగుతాయ్..
ప్రపంచ మార్కెట్ల ట్రెండ్,  డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కూడా కీలకమే...
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ: బడా కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల ట్రెండ్ కూడా కీలకమేనని పేర్కొన్నారు. అయితే, గురువారంనాడు డెరివేటివ్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ వారంలో మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకీ, వేదాంత, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ తదితర దిగ్గజాలు ఉన్నాయి.

మరోపక్క, రిపబ్లిక్ డే(26న) సెలవు కారణంగా ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. గ్లోబల్ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర వంటి అంశాలకు అనుగుణంగా స్వల్పకాలానికి మన మార్కెట్ల ట్రెండ్ ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపే అత్యధిక కంపెనీల ఫలితాలు వెల్లడికానుండటంతో మార్కెట్ల దృష్టి ప్రధానంగా వీటిపైనే ఉంటుందని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఫలితాలను వెల్లడించే కంపెనీలకు అనుగుణంగా స్టాక్స్ ఆధారితంగా కదలికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఫెడ్ సమీక్షపై దృష్టి...:
ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ మంగళ, బుధవారాల్లో చేపట్టనున్న పాలసీ సమీక్షను కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. గత సమీక్షలో పదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికాలో వడ్డీరేట్లను ఫెడ్ పెంచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవుతున్న నేపథ్యంలో ఫెడ్ ఈ సారి వడ్డీరేట్లను మరోవిడత పెంచకపోవచ్చని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.  గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్పంగా 19 పాయింట్లు నష్టపోయి 24,436 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు నష్టంతో 7,438 వద్ద స్థిరపడింది.

 తిరోగమనంలో ఎఫ్‌పీఐలు..
దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ నుంచి నికరంగా రూ.9,963 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ప్రధానంగా అంతర్జాతీయంగా వృద్ధి మందగమన భయాలు, ముడిచమురు ధరల తీవ్ర పతనం వంటివి దీనికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, దేశీ డెట్ మార్కెట్(బాండ్లు)లో మాత్రం ఎఫ్‌పీఐలు ఈ నెలలో రూ.2,353 కోట్లను నికరంగా వెచ్చించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు