బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి లీలా హోటల్స్‌!

18 Dec, 2018 00:58 IST|Sakshi

డీల్‌ విలువ రూ.4,500 కోట్లు

తుది దశలో ఒప్పందం

నెల రోజుల్లో అధికారికంగా వెల్లడి

ముంబై: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ భారత ఆతిథ్య రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సంస్థ హోటల్‌ లీలా వెంచర్‌ను చెందిన హోటళ్లను, బ్రాండ్‌ను రూ.4,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. భారీ రుణభారంతో కుదేలైన హోటల్‌ లీలా వెంచర్‌కు ఈ డీల్‌ ఊరట నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటల్‌ లీలా వెంచర్‌కు రూ.3,799 కోట్ల మేర రుణభారం ఉంది.

తుది దశలో డీల్‌...!  
ఈ డీల్‌లో భాగంగా హోటల్‌ లీలా వెంచర్‌కు సంబంధించిన మొత్తం ఐదు లగ్జరీ హోటళ్లలో కనీసం నాలుగింటిని బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌లో భాగంగా ఈ హోటల్‌కే చెందిన ఆగ్రాలోని ఒక భారీ నివాస స్థలాన్ని కూడా  బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌ బహుశా... వచ్చే ఏడాది ఆరంభంలోనే పూర్తికావచ్చని అంచనా. డీల్‌ దాదాపు తుది దశలో ఉందని, డీల్‌ సంబంధ వివరాలు నెల రోజుల్లోపలే వెల్లడవుతాయని, లీలా బ్రాండ్‌ను కూడా బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.  

4– 5 ఏళ్ల నుంచి ప్రయత్నాలు  
1986లో సి.పి.కృష్ణన్‌నాయర్‌ ప్రారంభించిన హోటల్‌ లీలా వెంచర్స్‌... ఒకప్పుడు ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, తాజ్‌ హోటల్స్, ఈఐహెచ్‌లకు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం హోటల్‌ లీలా వెంచర్‌ ఐదు లగ్జరీ హోటళ్లను నిర్వహిస్తోంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఉదయ్‌పూర్‌లో ఉన్న ఈ లగ్జరీ హోటళ్లలో మొత్తం గదుల సంఖ్య 1,400గా ఉంది. రుణ భారం తగ్గించుకోవడానికి 2014లో వాణిజ్య రుణ పునర్వ్యస్థీకరణ కోసం హోటల్‌ లీలా వెంచర్‌ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన రుణాలను అసెట్‌ రీస్ట్రక్చరింగ్‌ సంస్థ, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ ఏఆర్‌సీకి బదిలీ చేసింది. 2017 సెప్టెంబర్‌లో జేఎమ్‌ ఏఆర్‌సీకి రూ.275 కోట్ల విలువైన 16 లక్షల షేర్లను కేటాయించడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా మార్చింది. హోటల్‌ లీలా వెంచర్‌లో జేఎమ్‌ ఏఆర్‌సీకి 26 శాతం వాటా ఉంది. భారీగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడానికి  హోటళ్లను, ఖాళీ స్థలాన్ని విక్రయించాలని హోటల్‌ లీలావెంచర్‌ గత నాలుగు–ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు