నేటి నుంచే బీఎస్‌ఈ ఐపీఓ

23 Jan, 2017 02:10 IST|Sakshi
నేటి నుంచే బీఎస్‌ఈ ఐపీఓ

25న ముగింపు 
ఇష్యూ ధర రూ.805–806

న్యూఢిల్లీ: బాంబే స్టాక్‌  ఎక్సే్ఛంజ్‌(బీఎస్‌ఈ) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా బీఎస్‌ఈ రూ.1,243 కోట్లు సమీకరించనున్నది. ఒక దేశీయ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది వస్తున్న తొలి ఐపీఓ కూడా ఇదే.  రూ.805–806 ధరల శ్రేణి  ఉన్న  ఈ ఐపీఓ ఈ నెల 25(బుధవారం) ముగియనున్నది. ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖ విలువ గల 1.54 కోట్ల షేర్లను(28.26 శాతం వాటా) ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఆఫర్‌ చేయనున్నారు.

కనీసం 18 షేర్లకు, ఆ తర్వాత 18 గుణిజాల్ల చొప్పున షేర్లకు  బిడ్‌లు దాఖలు చేయాలి.  సెల్ఫ్‌ లిస్టింగ్‌కు సెబీ నిబంధనలు అనుమతించని కారణంగా బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలోనే  లిస్ట్‌ అవుతాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 46 లక్షల షేర్లను ఒక్కోటి రూ.806 చొప్పున కేటాయించి బీఎస్‌ఈ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించింది. ఈ దృష్ట్యా ఈ ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా.

ఆసియాలో పురాతనమైన ఎక్సే్ఛంజ్‌..
ఆసియా దేశాల్లో  అత్యంత పురాతనమైన  ఎక్సే్ఛంజ్‌అయిన బీఎస్‌ఈలో ప్రస్తుతం బజాజ్‌ హోల్డింగ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్, కాల్డ్‌వెల్‌ ఇండియా హోల్డింగ్స్, అకేసియా బన్యన్‌ పార్ట్‌నర్స్, సింగపూర్‌  ఎక్సే్ఛంజ్, అమెరికా ఇన్వెస్టర్‌ జార్జ్‌ సోరోస్‌కు చెందిన మారిషస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే క్వాంటమ్‌ ఫండ్, డాషే బోర్సే, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, జీకేఎఫ్‌ఎఫ్‌ వెంచర్స్, తదితర సంస్థలకు వాటాలున్నాయి. బీఎస్‌ఈలో ప్రారంభంలో సుమారుగా 9,000 మంది వాటాదారులున్నారని అంచనా. వీరిలో అధికులు స్టాక్‌ బ్రోకర్లే. కాలక్రమంలో విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు ఈ బ్రోకర్ల నుంచి ఈ వాటాలను కొనుగోలు చేశారు.

లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే బీఎస్‌ఈనే  ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టాక్‌ ఎక్సే్చంజ్‌. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా చూస్తే భారత్‌లో అతి పెద్దది, ప్రపంచంలో పదవది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1,10,23,189 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 5,911 కంపెనీలు లిస్ట్‌ అయ్యాయి. ఇక భారత్‌లో స్టాక్‌  మార్కెట్లో లిస్టయిన ఎకైక ఎక్సే్ఛంజ్‌.. ఎంసీఎక్స్‌(మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌). కాగా రూ.10 వేల కోట్ల సమీకరణ నిమిత్తం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు