తయారీ రంగ ఆందోళనలు

2 Oct, 2014 01:37 IST|Sakshi
తయారీ రంగ ఆందోళనలు

 గత తొమ్మిది నెలల్లోలేని విధంగా సెప్టెంబర్ నెలకు తయారీ రంగం మందగించిన సంకేతాలు తాజాగా సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. వెరసి సెన్సెక్స్ 62 పాయింట్లు క్షీణించి 26,568 వద్ద ముగిసింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పీఎంఐ సూచీ గణాంకాలు త యారీ రంగ మందగమనాన్ని వెల్లడించడంతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 7,945 వద్ద నిలిచింది. బీఎస్‌ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ నష్టపోవడం గమనార్హం.

డాలరుతో మారకంలో రూపాయి 62కు పడటం ద్వారా ఏడు నెలల కనిష్టానికి చేరడంతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. విప్రో 3.2%, ఇన్ఫోసిస్ 2.7%, టీసీఎస్ 1.4% చొప్పున ఎగశాయి. గ్లోబల్ దిగ్గజం ఒరాకిల్‌తో సర్వీసుల ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పేర్కొన్న ఇన్ఫోసిస్ ఐటీ షేర్లకు జోష్‌నిచ్చిందని నిపుణులు వ్యాఖ్యానించారు.

 ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ డీలా
 బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 2% పుంజుకోగా, ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ 1.5% స్థాయిలో నీరసించాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో మారుతీ, టాటా పవర్, టాటా స్టీల్, గెయిల్, రిలయన్స్, ఐటీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్ 3-1.5% మధ్య నష్టపోయాయి. మరోవైపు ఎంఅండ్‌ఎం 2%, హీరోమోటో 1% చొప్పున లాభపడ్డాయి.  

 నేటి నుంచి వరుస సెలవులు
 గురువారం(2) నుంచి స్టాక్ మార్కెట్లకు మంగళవారం(7) వరకూ వరుసగా సెలవులు వచ్చాయి. గురువారం(2న) మహాత్మా గాంధీ జయంతికాగా, శుక్రవారం(3న) విజయదశమి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. ఇక శని, ఆదివారాలు యథాప్రకారం సెలవులుకాగా, సోమవారం(6న) బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ మళ్లీ మంగళవారమే(7న) మొదలుకానుంది. కాగా, ఐదు రోజులపాటు వరుసగా స్టాక్ మార్కెట్లకు సెలవులు రావడం అరుదైన విషయమని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు