చివర్లో టపటపా..!

20 Mar, 2020 04:57 IST|Sakshi

కొనసాగుతున్న కోవిడ్‌ వైరస్‌ కల్లోలం 

నాలుగో రోజూ నష్టాలే

ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి రూపాయి 

లాభాల మురిపెం అరగంటే...

29,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌

581 పాయింట్ల నష్టంతో 28,288 వద్ద ముగింపు 

205 పాయింట్ల పతనంతో 8,263కు నిఫ్టీ   

కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్న భయాలతో గురువారం కూడా స్టాక్‌ మార్కెట్‌  పతనం కొనసాగింది.  వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 81 పైసలు పతనమై 75 మార్క్‌ ఎగువకు పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 501 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 581 పాయింట్ల నష్టంతో 28,288 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రోజంతా 742 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 205 పాయింట్ల నష్టంతో 8,263 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీలు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.

2,656 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
ప్రపంచ మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో మన మార్కెట్‌ కూడా భారీ నష్టాలతోనే మొదలయ్యింది. సెన్సెక్స్‌ 1,097 పాయింట్లు, నిఫ్టీ 406 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. అరగంటలోనే సెన్సెక్స్‌ 2,155 పాయింట్లు పతనమై 26,715 పాయింట్ల వద్ద, నిఫ్టీ 636 పాయింట్లు క్షీణించి 7,833 పాయింట్ల వద్ద ఇంట్రా డే కనిష్టాలను తాకాయి. ఆ తర్వాత నుంచి నష్టాలు తగ్గుతూ వచ్చాయి. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలు 1,000 పాయింట్ల మేర రికవరీ కావడంతో మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్‌ లాభాల్లోకి మళ్లాయి. అయితే  అది స్వల్పకాలమే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్‌ 501 పాయింట్లు, నిఫ్టీ 106 పాయింట్ల మేర లాభపడ్డాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 2,656 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి రూ. 4,623 కోట్ల నికర అమ్మకాలను కూడా కలుపుకుంటే, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.47,897 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. పెట్టుబడులన్నింటినీ నగదుగా మార్చుకోవాలనే తపనతో ఇన్వెస్టర్లు పుత్తడితో సహా పలు ఇతర పెట్టుబడి సాధనాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో షేర్లు, బాండ్లు, పుత్తడి, కమోడిటీలు అన్నీ పతనమవుతూ ఉన్నాయి.  

ప్యాకేజీలున్నా.... పతనమే
వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్రకటించిన ఉద్దీపన చర్యలు... ప్రపంచ మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. దక్షిణ కొరియా సూచీ కోస్పి 8 శాతం నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో అత్యధికంగా పతనమైన సూచీ ఇదే. యూరప్‌ కేంద్ర బ్యాంక్‌ 75,000  కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనా,  ఆ త ర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు 1– 2% లాభాల్లో ముగిశాయి.
     
► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. 

► దాదాపు 1,200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బజాజ్‌ ఫైనాన్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

► బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.2,746 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో  బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. యాక్సిస్‌ బ్యాంక్‌ 9.5 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 9 శాతం, టెక్‌ మహీంద్రా 8 శాతం, ఓఎన్‌జీసీ 7 శాతం చొప్పున క్షీణించాయి. 

► మరోవైపు ఐటీసీ 7 శాతం లాభంతో రూ.162 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. భారతీ ఎయిర్‌టెల్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, హీరో మోటొకార్ప్‌ షేర్లు 7.5 శాతం మేర ఎగిశాయి.

భారత్‌ వృద్ధి క్యూ1లో 3.1 శాతమే: బీఓఎఫ్‌ఏ
ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్‌ త్రైమాసికం వృద్ధి అంచనాలను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బీఓఎఫ్‌ఏ) సెక్యూరిటీస్‌ 48 గంటల్లో రెండవసారి ఏకంగా 90 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు 1%) తగ్గించింది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కేవలం 3.1 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదవుతుందని వివరించింది. 2020–21లో వృద్ధి రేటు 4.1%గా ఉంటుందని విశ్లేషించింది. బుధవారంనాడు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఒక నివేదికను విడుదల చేస్తూ, జూన్‌ త్రైమాసికంలో భారత్‌ జీడీపీని 80 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 4%కి కుదించింది. గురువారం ఈ రేటునూ మరో 90 బేసిస్‌ పాయింట్లు కుదించడం గమనార్హం. ఇక 2020–21 భారత్‌ వృద్ధి రేటును 5.1%గా 48 గంటల క్రితం లెక్కకట్టిన ఈ సంస్థ తాజాగా ఈ అంచనాలకూ 100 బేసిస్‌ పాయింట్లు కోతపెట్టడం (4.1 శాతానికి) గమనార్హం.

రిలయన్స్‌... 4 నెలల్లో 5 లక్షల కోట్లు హాంఫట్‌
వరుసగా ఐదో రోజూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టపోయింది. ఇంట్రాడేలో 8 శాతం పతనమైన ఈ షేర్‌ చివరకు 5.3 శాతం నష్టంతో రూ.917 వద్ద ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ షేర్‌ 17 శాతం నష్టపోగా, మార్కెట్‌ క్యాప్‌ రూ.1,20,312 కోట్లు తగ్గింది. నాలుగు నెలల క్రితం (గత ఏడాది నవంబర్‌లో)ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం సగం విలువ హరించుకుపోయి రూ.5,81,374 కోట్లకు పడిపోయింది. కాగా ముకేశ్, ఆయన భార్య, పిల్లలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో తమ తమ వాటాను స్వల్పంగా పెంచుకున్నారు. ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీ నుంచే ఈ వాటాలను కొనుగోలు చేయడంతో  రిలయన్స్‌ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌లో మార్పుచోటు చేసుకోలేదు. మొత్తం మీద ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అం బానీ, ఆయన పిల్లలు–ఆకాశ్, ఇషా, అనంత్‌లకు ఒక్కొక్కరికి 75 లక్షల షేర్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు